– ఎలీ లిల్లీ గ్లోబల్ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ఎలీ లిల్లీ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడమంటే ఈ నగరం ఘనతను మీరు ప్రపంచానికి చాటిచెప్పినట్లేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ ఇప్పటికే గుర్తింపు పొందిందని, 2000కుపైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. ఎలీ లిల్లీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో టాలెంట్ ఉంది.. లీడర్‌షిప్ ఉంది.. విజన్ ఉంది.. మంచి పాలసీ ఉంది.. మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అందుకే ఎలీ లిల్లీ లాంటి గ్లోబల్ లీడర్‌కు ఇది అనుకూలమైన కేంద్రంగా మారిందనని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈ రోజు హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి గ్లోబల్ జీసీసీ రాజధానిగా ఎదిగిందని, ఇందుకు ఇవాళ్టి ఈ కార్యక్రమమే తిరుగులేని నిదర్శనమని సీఎం చెప్పారు. ఈ విజయ సాధనకు అహర్నిశలు శ్రమించిన మంత్రి శ్రీధర్‌బాబుకు, జయేష్ రంజన్, పాలుపంచుకున్న అధికారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇది తెలంగాణ రైజింగ్-2047 దిశగా తాము వేసిన మరొక ముఖ్యమైన అడుగు అని చెప్పారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దుతామంటూ ఎలీ లిల్లీ సంస్థ లీడర్ షిప్‌ను, ఉద్యోగులను హైదరాబాద్ నగరానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నానన్నారు. తెలంగాణపై నిరంతర నమ్మకం ఉంచి అండగా నిలిచి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నందుకు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రపంచశ్రేణి కార్పొరేషన్లకు, కంపెనీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు ప్రారంభమైన ఎలీ లిల్లీ నూతన కేంద్రం ఆ సంస్థ గ్లోబల్ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుందని, ఈ టెక్నాలజీ, ఇన్నొవేషన్ సెంటర్ ప్రపంచవ్యాప్తంగా రోగులకు పరిష్కారాల కోసం పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. 200కిపైగా ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని, భారత్‌లో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో సుమారు 40 శాతం తెలంగాణలోనే జరుగుతోందని, ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్రతి 3 టీకాలలో ఒకటి హైదరాబాద్‌లో అభివృద్ధి చేయడం లేదా తయారవుతుండటం తమకు గర్వకారణమని అన్నారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, దేశంలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్ పరిశోధన- అభివృద్ధి సముదాయంగా నిలిచిందని, ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ సంస్థల కోసం హైదరాబాద్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచ గమ్యస్థానంగా మారిదని సీఎం వివరించారు. మధుమేహం, ఆంకాలజీ, ఇమ్యునాలజీ, న్యూరోసైన్స్ రంగాలలో ఎలీ లిల్లీ కృషి ఒక గేమ్ ఛేంజర్‌గా నిలిచిపోతుందని, ఈ సంస్థ చేసిన కృషి మిలియన్లమంది జీవితాలను ప్రభావితం చేయడంతో వారిని రక్షించడానికి తోడ్పడిరదని చెప్పారు. హైదరాబాద్‌లో పనిచేయబోయే ఎలీ లిల్లీ ఉద్యోగులు కేవలం హైదరాబాద్‌లో నివసించడం, పనిచేయడం మాత్రమే కాదు ఇప్పుడు మీరు తమ కుటుంబ సభ్యులుగా మారారని పేర్కొన్నారు. మీ సహకారంతో తెలంగాణను భారత దేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మాత్రమే కాక ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు నంబర్ వన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అన్నారు. అందరం కలిసి కొత్త ఆవిష్కరణలు చేద్దాం.. ప్రజల జీవితాలను మారుద్దాం.. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును పునర్నిర్వచిద్దాం అని అన్నారు.
మా లక్ష్యం 100 జేసీసీల ప్రారంభం : మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్‌లో 2024-25లో 70 జీసీసీలు ప్రారంభమయ్యాయని, ఇది దేశంలోనే ఒక రికార్డు అంటూ మాకు, ఇతర రాష్ట్రాలకు పోలికే లేదు.. మాకు మేమే పోటీ.. 2025-26లో 100 జేసీసీలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ దిశగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మెడ్ టెక్ రంగంలో తెలంగాణ అవకాశాల గని.. లైఫ్ సైన్సెస్, డిజిటల్ హెల్త్, ఏఐ ఇన్ హెల్త్ కేర్, తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్‌తో ఇండస్ట్రీ పాలసీని అనుసంధానం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఏటా మూడు లక్షల మంది స్టెమ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు.. జీనోమ్ వ్యాలీ, మెడ్ టెక్ పార్క్ వంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.. త్వరలోనే కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని అందుబాటులోకి తీసుకొస్తున్నాం.. తెలంగాణను మెడ్ టెక్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నాం అని అన్నారు. ఇప్పటికే మన దగ్గర దిగ్గజ సంస్థలు నోవార్టిస్, ఆస్ట్రజేనేకా, మెడ్ ట్రానిక్ లాంటివి ఎన్నో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయంటూ ఈ జాబితాలో ఎలీ లిల్లీ కూడా చేరడంతో మెడ్ టెక్ రంగంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుందని ఆకాంక్షించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆర్ అండ్ డీ ల్యాబ్స్, మాన్యుఫాక్చరింగ్ స్పేస్, మెడ్ టెక్ పార్కుల కోసం తెలంగాణలో 1.1 కోట్ల చదరపు అడుగుల స్పేస్‌ను ఆయా సంస్థలు లీజుకు తీసుకున్నాయని, ఇది దేశంలోనే అత్యధికమని, ఇది నంబర్ కాదు.. మెడ్ టెక్ రంగంలో దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ ప్రగతికి నిదర్శనం అని వివరించారు. ఏఐ లీడ్ డ్రగ్ డిస్కవరీ, క్లౌడ్ బేస్డ్ క్లినికల్ ప్లాట్‌ఫామ్స్, ఆటోమేటెడ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ తదితర అంశాలపై దృష్టి సారించనున్న ఎలీ లిల్లీ జీసీసీ మెడ్ టెక్ రంగంలో అద్భుతాలను ఆవిష్కరిస్తుందని బలంగా విశ్వసిస్తున్నామన్నారు. మెడ్ టెక్ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ, జాతీయ సంస్థలకు ఈ వేదిక ద్వారా ప్రభుత్వం తరఫున కోరుతున్నానని, రైజింగ్ తెలంగాణలో భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.





