– మండల స్థాయి పోటీలకు రంగం సిద్ధం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: ప్రభుత్వ క్రీడా శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2025 రెండో విడతలో భాగంగా మొదటి అంచె గ్రామీణ క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయి. అన్ని మండల కేంద్రాల్లో ఉత్సాహభరితంగా టార్చ్ రిలేలు నిర్వహించిన అనంతరం, జనవరి 17 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3105 క్లస్టర్లలో గ్రామీణ స్థాయి పోటీలు నిర్వహించారు. గ్రామీణ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు ఇప్పుడు జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మండల స్థాయి పోటీలకు సిద్ధమవుతున్నారు. గత సంవత్సరం నిర్వహించిన సీఎం కప్- 2024 పోటీల్లో దాదాపు మూడు లక్షల మంది యువ క్రీడాకారులు పాల్గొనగా ఈ ఏడాది ఇప్పటివరకు రెండు లక్షల 65 వేల మందికి పైగా క్రీడాకారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. జిల్లాస్థాయి పోటీలు పూర్తయ్యి రాష్ట్ర\స్థాయి పోటీలు ప్రారంభమయ్యేలోపు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సీఎం కప్ పోటీలకు సాంకేతిక సహకారంగా ఏఐ చాట్‌బాట్, వాట్సాప్ చాట్, ప్రత్యేక వెబ్‌సైట్, అలాగే క్రీడాకారుల సందేహాల నివృత్తికి 24 గంటల ఫోన్ లైన్లు అందుబాటులో ఉంచడం ద్వారా సమర్థవంతమైన సమాచార సమన్వయం జరుగుతోందని పేర్కొన్నారు. దీనివల్ల మరింతమంది క్రీడాకారులు పోటీలకు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. గ్రామ స్థాయి పోటీల నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్లు, అలాగే మండల స్థాయి వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పోటీలు సజావుగా ముగిశాయని అధికారులు తెలిపారు. ఇదే ఉత్సాహంతో మండల స్థాయి పోటీలను కూడా విజయవంతంగా నిర్వహిస్తామని వారు వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.