పోరాట యోధుడు గురూజీ

– శిబు సోరెన్‌ మృతికి ముఖ్యమంత్రి సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: జార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్ర సాధనలో, గిరిజన సమస్యల పరిష్కారంలోనూ మడమ తిప్పని పోరాటం చేసిన యోధుడు గురూజీ జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కొనియాడారు. శిబుసోరెన్‌ మృతికి ఆయన సంతాపం వ్యక్తం చేశారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరులోనూ శిబు సోరెన్‌ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన ఎప్పుడూ మద్దతు తెలిపేవారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సైతం చివరి వరకు ఆయన మద్దతుదారుగా నిలిచారంటూ ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆదివాసీ సమాజానికి గురూజీ చేసిన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. ఎనిమిదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా, జార్ఞండ్‌ ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలందించారని సీఎం తెలిపారు. శిబు సోరెన్‌ కుమారుడు, జార్ఞండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

శిబు జీవితమే ఒక సందేశం : మంత్రి సీతక్క

పోరాట పటిమకు ప్రతీకగా నిలిచిన కేంద్ర మాజీ మంత్రి, జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌ మృతి పట్ల పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తన సంతాపాన్ని తెలిపారు. ఆదివాసీ హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం భారతదేశ సామాజిక రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆయన జీవితమే ఒక సందేశమని కొనియాడారు. దేశానికి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి గురూజీ మృతి తీరని లోటుగా పేర్కొన్నారు. శిబు సోరెన్‌ చూపిన మార్గం ఈనాటి తరాలకు మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు మంత్రి సీతక్క తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

డిప్యూటీ సీఎం భట్టి సంతాపం

జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివాసీ ప్రజల హక్కులు, సంక్షేమం కోసం, జార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన పోరాటాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదని గుర్తు చేసుకున్నారు. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి అయిన శిబు సోరెన్‌ కుమారుడు హేమంత్‌ సోరెన్‌కు, వారి కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు భట్టి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *