భద్రాచలం అభివృద్దికి రూ.586 కోట్ల నిధులు

– మొదటి దశలో రూ.351 కోట్లతో పనులు ప్రారంభం
– రేప‌టి కళ్యాణోత్సవానికి హాజరవుతున్న సిఎం రేవంత్
– ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల

భద్రాచలం, ప్ర‌జాతంత్ర‌, మార్చి 26: శ్రీ రాముడు నడయాడిన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో నిధులు మంజూరు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.మొదటి దశలో రూ.351 కోట్లతో చేపట్టే పనులకు సీఎం  శుక్రవారం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మొత్తం రూ.586 కోట్లతో రామాలయంతోపాటు భద్రాచలం పట్టణాభివృద్ధిని మూడు దశల్లో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని మిథిలా కళ్యాణ మండపం వేదికగా శుక్రవారం స్వామివారి కళ్యాణం జరుగనుండ‌గా అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి తుమ్మల పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.శ్రీ సీతారామచంద్రస్వామి దంపతులకు ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల‌ను సీఎం రేవంత్ రెడ్డి సమర్పిస్తార‌ని తెలిపారు. ఆయనకు ప్రజల తరఫున ఘనంగా స్వాగతం పలుకుతామని చెప్పారు. భద్రాచలం వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతీయ రహదారులు, రైల్వే కనెక్టివిటీ, ఎయిర్ పోర్టు ఏర్పాటు దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక గోదావరిలో నావిగేషన్ సిస్టమ్ ఏర్పాటుకు అవకాశం ఉందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే పనులు చేపట్టినట్లు చెప్పారు. సీతారాముల కళ్యాణం వీక్షించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై దేవాలయం అధికారులు, సిబ్బందికి మంత్రి తుమ్మల దిశా నిర్దేశం చేశారు.

భద్రాద్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

భక్త రామదాసు నిర్మించిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం “దక్షిణ అయోధ్య”గా ప్రసిద్ధి చెందినదని, ఈ పవిత్ర క్షేత్రానికి దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు.భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం, మహా పట్టాభిషేకం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు విచ్చేయనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రతి శాఖ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, వీఐపీలు, వివిఐపీలు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు.  శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు స్వామివారి కల్యాణం, 28వ తేదీన అదే సమయాల్లో మహా పట్టాభిషేకం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.351 కోట్లను మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. స్వామివారి కల్యాణం అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. దేవాలయ అభివృద్ధితోపాటు భద్రాచలం పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు రహదారులు, రైల్వే, నదీ మార్గాల అభివృద్ధిపై చర్యలు తీసుకుంటున్నామని, అమరావతి–జగదల్పూర్ మధ్య రవాణా సౌకర్యాల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకొని కరకట్టల ఎత్తు పెంపు, ఘాట్‌ల నిర్మాణం, రెండో పీట నిర్మాణం వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో భక్తుల రాకను మరింత సులభతరం చేసే దిశగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అనంతరం భద్రాచలం అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల ఫోటోలను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఎస్పీ రోహిత్ రాజ్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం మిథిలా స్టేడియం వద్ద జిల్లా కలెక్టర్ అంకిత్ సెక్టార్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలంబ్రాల కౌంటర్లు, ప్రసాదాల కౌంటర్లు, పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వైద్య సదుపాయాలు వంటి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సెక్టార్ అధికారులు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, ఎక్కడైనా లోపాలు గమనించిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. శ్రీరామనవమి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *