– కోదండరాం సర్‌కు మళ్లీ ఎమ్మెల్సీ ఇస్తా
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
– వర్సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) అని, తెలంగాణ, ఉస్మానియా రెండూ అవిభక్త కవలల్లాంటివని (twins) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఇది.. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు ఈ యూనివర్సిటీ విద్యార్థులేనని, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డి ఇక్కడి విద్యార్థే అని వివరించారు. యూనివర్సిటీలో రూ.90 కోట్లతో నిర్మించిన భవనాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. దుందుభి, బీమా వసతి గృహాలను ప్రారంభించి అనంతరం డిజిటల్ లైబ్రరీ, రీడిరగ్ రూమ్‌లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ఓయూ వీసీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నలుమూలలా ఏ సమస్య వచ్చినా మొదట చర్చ జరిగేది ఇందులోనేనన్నారు. చదువుతోపాటు పోరాటాన్ని నేర్పించే గడ్డ ఓయూ అని, రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిందని చెప్పారు. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారిది ఓయూనేనని, యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి రాష్ట్ర సాధనలో సమిధలయ్యారని తెలిపారు. గత పదేళ్ల పాలనలో ఈ యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. ఓయూకు పూర్వ వైభవం తేవాలని తాము ఆలోచించామని, అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చదువుకుని చైతన్యం ఉన్న వారిని వీసీలుగా నియమించామని చెప్పారు. సమాజాన్ని చైతన్యపరిచే మేధా సంపత్తిని ఈ యూనివర్సిటీ నుంచి ఆశిస్తున్నామన్నారు.
యువ నాయకత్వం అవసరం
దేశంలో 60 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారేనని, ఇది మన దేశ సంపద అని, 21 ఏళ్ల వయసులో ఐఏఎస్‌లు దేశానికి సేవలందిస్తున్నప్పుడు 21 ఏళ్ల యువకులు శాసనసభలో ఎందుకు అడుగుపెట్టకూడదు అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. దేశానికి యువ నాయకత్వం అవసరమన్నారు. రాష్ట్రంలోని పరిణామాలు చూస్తుంటే ఆవేదన కలుగుతోందని, యువతను గంజాయి, డ్రగ్స్ వ్యసనాలు పట్టి పీడిస్తున్నాయని, ఆ వ్యసనాల నుంచి యువతను బయటపడేలా చేయాలన్నారు. చదువు, చైతన్యం ఉంటేనే సమాజంలో రాణిస్తారన్నారు. మీ తలరాతలు మార్చేది చదువొక్కటే అని ఉద్బోధించారు. యూనివర్సిటీ అభివృద్ధిపై అధ్యయనానికి ఇంజనీర్స్ కమిటీ వేయాలని అధికారులను ఆదేశిస్తున్నానన్నారు. ఓయూను స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతామంటూ ఈ యూనివర్సిటీ చరిత్రకు నిలువెత్తు సాక్షిగా నిలవాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీ అభివృద్ధికి ఏం కావాలో అడగండి.. అంచనాలు తయారు చేసి ఇవ్వండి.. మళ్లీ వస్తా.. ఆర్ట్స్ కాలేజీ వద్ద మీటింగ్ పెట్టి నిధులు మంజూరు చేస్తా అని చెప్పారు. పోలీసులను నేను ఆదేశిస్తున్నా.. ఆ రోజు యూనివర్సిటీలో ఒక్క పోలీస్ కనిపించొద్దు.. నిరసన తెలిపే వారిని తెలపనివ్వండి.. తనను రావొద్దని అడ్డుకునే వారికి సమాధానం చెప్పే చిత్తశుద్ధి తనకుందని అన్నారు.
కోదండరాం సర్‌కు మళ్లీ ఎమ్మెల్సీ ఇస్తా
కొంతమంది నాయకులకు పదవులు పోయాయన్న ఆవేదన ఉంటుంది.. వాళ్ల కొడుకులను ఏదో చేద్దామనుకుంటే ఏదో అవుతున్నారని బాధ ఉంటది.. వారి ఉచ్చులో మీరు పడొద్దు.. సమస్య ఉంటే మాకు చెప్పండి.. మా మంత్రులు మీకు అందుబాటులో ఉంటారని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. కోదండరామ్ సార్ పై కుట్ర చేసి సుప్రీం కోర్టుకు వెళ్లి పదవి తొలగించారని చెప్పారు. సార్‌కు మళ్లీ ఎమ్మెల్సీ ఇస్తామని స్పష్టం చేశారు. అపోహలకు లోనుకాకండి.. అబద్ధాల సంఘం చెప్పే మాటలు నమ్మొద్దు.. వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో సెంట్రల్ యూనివర్సిటీలో సింహాలు, ఏనుగులు ఉన్నాయని ప్రచారం చేసి అడ్డుకున్నారు.. మానవ రూపంలోని మృగాలు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు లాంటివారు.. వాళ్లు మళ్లీ వస్తే ఉస్మానియా యూనివర్సిటీని ఉండనివ్వరు అని రేవంత్‌రెడ్డి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





