– కొత్తగూడెం సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
~ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన కొత్తగూడెం
– అందుకే ప్రతీ కార్యక్రమం ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభం
– రాష్ట్రాన్ని ప్రసాదించిన మన్మోహన్‌సింగ్ పేరుతో ఎర్త్ సైన్స్ వర్సిటీ
– – కొత్తగూడెం సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: తెలంగాణ ఉద్యమానికి స్పూర్తినిచ్చిన ప్రాంతం కొత్తగూడెం అని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నేరవేర్చి రాష్ట్రాన్ని ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు ఎర్త్ యూనివర్సిటీకి పెట్టడం గొప్ప అదృష్టమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహాన్ సింగ్ సంక్షోభంలో ఉన్న దేశాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయారన్నారు. తెలంగాణ ప్రాంతవాసుల చిరకాల వాంఛ నెరవేర్చిన ఆయన పేరుతో ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభించుకున్నామని అన్నారు. కొత్తగూడెంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించిన సంసందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. సింగరేణి వంటి సంస్థలను అభివృద్ధి చేయాలంటే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ వంటివి అవసరం అన్నారు. భద్రాద్రి రాముల వారి సాక్షిగా ఖమ్మం జిల్లా అభివృద్ది బాధ్యత తనదని, మంచి పాలన అందిస్తున్నామని, మంచి పాలన ఉంటే ఉచిత కరెంటు, రేషన్ కార్డుల పంపిణి, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరలు వంటివి వస్తాయని వివరించారు.కృష్ణా, గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా పొలాల్లో సిరులు కురిపించాలని తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఖమ్మం జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు పదేళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయని, గత పాలకులకు కమీషన్లు కురిపించాయి తప్ప నీళ్లు పారలేదని విమర్శించారు. తెలంగాణకు తాను సీఎంగా ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లా మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల అనుకుంటే ఏమైనా జరుగుతుందంటూ జిల్లా అభివృద్దికి నిధులు, అనుమతులు మంజూరు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. రేషన్ కార్డుల పంపిణి, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరలు.. ఏ కార్యక్రమమైనా ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించామని చెప్పారు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కోసం వందలాది ఎకరాలను రైతులు ఇచ్చినప్పటికీ ఉద్యోగాలు మాత్రం ఇతర ప్రాంతాల వారికి ఇచ్చారని, అందుకే తెలంగాణ ఉద్యమం పాల్వంచలోనే ప్రారంభమైందని చెప్పారు. విద్య మాత్రమే తెలంగాణను ఉన్నతస్థానంలో నిలబెడుతుందంటూ అందుకే ఆ వైపు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు మంచోళ్లు ఉండాలి.. మంత్రులతో కలిసి పనిచేసే వాళ్లు కావాలి.. అబివృద్ది కోసం మంచి సర్పంచ్‌లను ఎన్నుకోవాలి.. గ్రామాల్లో రాజకీయ కక్షలు మానండ అని ప్రజలకు హితోక్తులు చెప్పారు. పదేళ్లు అండగా నిలబడండి.. తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలబెడదాం అని రేవంత్‌రెడ్డి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




