– పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేసి చూపిస్తా
– రాయలసీమ లిఫ్ట్‌ను చంద్రబాబు రద్దు చేసుకోవాల్సిందే
– ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం
– మహిళలను కోటీశ్వరులను చేసే పనిలో ఉన్నాం
– ఎస్సీ వర్గీకరణను అమలు చేసి చూపాం
– కొల్హాపూర్ పర్యటనలో సిఎం రేవంత్ ఉద్ఘాటన
కొల్హాపూర్,ప్రజాతంత్ర,జూలై 18: పదేళ్లపాటు తానే అధికారంలో ఉంటానని, పాలమూరుప్రాజెక్టులను పూర్తి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడంలో తన నిబద్ధతను ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతోపాటు దిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి కీలక ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్‌ను రద్దు చేసుకోవాలని, అందుకు సహకరించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. సహకారం లేకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం నా బాధ్యత అని స్పష్టం చేశారు. అంతేకాదు కేసీఆర్.. నీ గుండె, నీ కొడుకు గుండె మీద కూడా రాసుకో.. మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటానని రేవంత్ పేర్కొన్నారు. ఈ పాలమూరు బిడ్డే తెలంగాణను ప్రజా ప్రభుత్వంతో నడిపిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి నేర్చుకోవాలని సవాల్ విసిరారు. నీకు దుఃఖ మొస్తే ఏడ్చినా, బావిలో దూకినా, నీ ఇష్టం. కానీ తెలంగాణ ప్రజల కోసం మేము చేసే మంచి పనులను చూస్తూ ఉండాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పాలమూరు ప్రాంతం సస్యశ్యామలంగా మారి, రైతుల జీవనోపాధికి బలమైన ఆధారంగా నిలుస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని జటప్రోలులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా, పాలమూరు ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపిరి లభించింది. ఈ సందర్భంగా రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ స్కూల్ విద్యార్థులకు ఆధునిక విద్య, సౌకర్యాలతో ఉజ్వల భవిష్యత్తును అందించనుంది. ఈ సందర్భంగా కొల్లాపూర్ అభివృద్ధికి అవసరమైన నిధులను పూర్తిగా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హా ఇచ్చారు. పాలమూరు ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేస్తామని హా ఇచ్చారు. డిసెంబర్‌లోగా భూసేకరణ పూర్తి చేసి, కృష్ణా జలాలను పొలాలకు తీసుకొస్తామని అన్నారు. మా పొలాల్లో కృష్ణా నీళ్లు పారుతుంటే, కొందరు దీనిని ఓర్చుకోలేకపోతున్నారు. కేసీఆర్ లాంటి వాళ్లు విషం చిమ్ముతున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. పాలమూరు పచ్చగా మారితే, రైతులు సంతోషంగా ఉంటారని, అది కొందరికి కడుపుమంటగా ఉందని రేవంత్ అన్నారు. పాలమూరు పచ్చగా మారాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లక్ష్యం కోసం కృషి చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. పాలమూరు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. రైతులకు రుణమాఫీ, మహిళలకు సాధికారత, ప్రాజెక్టుల పూర్తితో పాలమూరు కొత్త ఒరవడిని సాధిస్తుందని రేవంత్ హా ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేశామని, వరి పండించిన రైతులకు బోనస్ కూడా ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే కరెంటు ఉండదని కొందరు అన్నారు. కానీ, మేం 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, వెయ్యి బస్సులకు మహిళలను యజమానులుగా చేశామని అన్నారు. రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంక్‌లకు యజమానులుగా, సోలార్ విద్యుత్ కాంట్రాక్టులు ఇచ్చి మహిళలను సాధికారత వైపు నడిపిస్తున్నామని వివరించారు. కేసీఆర్ తన బిడ్డకు బంజారాహిల్స్‌లో బంగ్లా కట్టించారు. కానీ మా ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని రేవంత్ హా ఇచ్చారు. కేసీఆర్ హయాంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ హాలు నెరవేరలేదని రేవంత్ విమర్శించారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేసీఆర్ చెప్పి, ఎందుకు చేయలేదన్నారు. దళిత బిడ్డలు చదువుకుంటే, రాజ్యాలు ఏలితే కొందరికి దుఃఖం వస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగ కులాల వర్గీకరణ చేసి న్యాయం చేసిందని రేవంత్ తెలిపారు. 2035 నాటికి తెలంగాణను ట్రిలియన్ ఎకానగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు.
స్వయం సహాయక సంఘాలకు రుణ చెక్కులు
కొల్లాపూర్ నియోజకవర్గంలోని 2,671 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.6 కోట్ల 33 లక్షల విలువైన చెక్కులను పంపిణీ సీఎం పంపిణీ చేశారు. అలాగే 570 స్వయం సహాయక సంఘాలకు రూ.41 కోట్ల 61 లక్షల బ్యాంకు రుణాలకు సంబంధించిన చెక్కులను, రూ.20 లక్షల ప్రమాద బీమా చెక్కును, రూ.9 లక్షల 35 వేల 443 రుణ బీమా చెల్లింపు చెక్కును అందజేశారు.





