– అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజ
– దేవరకొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
– మద్దిమడుగులో సేవాలాల్ విగ్రహం
– డిండి ప్రాజెక్టును పూర్తిచేస్తాం
– దేవరకొండ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
– పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
దేవరకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: రాబోయే రోజుల్లో దేశంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలబెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా శనివారం ఆయన నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో సుమారు రూ.20 కోట్ల వ్యయంతో దేవరకొండ మున్సిపాలిటీలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే మెప్మా మహిళా సంఘాలకు రూ.11 కోట్ల 33 లక్షల 46వేలు బ్యాంకు లింకేజీ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో, గంజాయిని అరికట్టడంలో, విద్య, వైద్యం, తదితర రంగాలలో రాష్ట్రం ఇప్పటికే దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. డిసెంబర్ 8, 9 తేదీలలో మహేశ్వరంలో నిర్వహించనున్న రైజింగ్ సమ్మిట్ లో తెలంగాణ అభివృద్ధి ,సంక్షేమాలను ప్రపంచానికి కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, దేవరకొండ నియోజకవర్గానికి నర్సింగ్ కళాశాలను ఇస్తామని, ఇందుకుగాను వెంటనే అంచనాల రూపొందించి పంపించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. నియోజకవర్గంలో తండాల నుండి మండలాలకు, మండలాల నుండి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ కు రహదారులు నిర్మించేందుకు అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి , రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులను దేవరకొండ కు పంపించి దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ కోరిన విధంగా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించేలా పంపిస్తామని తెలిపారు. గిరిజనులు అత్యధికంగా ఉండే దేవరకొండ, అచ్చంపేట ప్రాంతాలలో మద్దిమడుగును పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని మద్దిమడుగులో ఏర్పాటు చేసుకుందామని అన్నారు. దేవరకొండ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి గతంలో నిధులు ఇచ్చామని, అసంపూర్తిగా నిలిచిపోయిన దేవాలయ పనులను పూర్తి చేసినందుకు రానున్న ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించి పూర్తి చేస్తామన్నారు .దేవరకొండ జూనియర్ కళాశాల అభివృద్ధికి రూ.6 కోట్ల నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని పెండ్లిపాకల తో పాటు, అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఈ అసెంబ్లీ హాయంలోనే పూర్తి చేస్తామని, అలాగే ఎస్ఎల్ బి సీని, డిండి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో రెండేళ్లలో 61 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ,24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని, 25 లక్షల 35 వేల రైతు కుటుంబాలకు రూ. 25614 కోట్ల రైతు రుణమాఫీ చేశామని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, రాష్ట్రవ్యాప్తంగా రూ. 22,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని, ఐటిడిఏ, చెంచులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అదనంగా 25 వేల ఇండ్లు ఇవ్వడానికి ప్రత్యేకంగా జీవో తీసుకువచ్చామన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2004- 2014 వరకు లంబాడి తండాలు, ఆదివాసిగూడలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు. రాష్ట్రంలో మూడు కోట్ల 10 లక్షల మంది సన్న బియ్యం తింటున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ సన్న బియ్యం ఇవ్వటం లేదని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు బాగుపడుతున్నాయని ఆయన చెప్పారు. అవసరమైన, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 2 లక్షల 50 వేల మందికి సన్న బియ్యం ఇస్తున్నామని, జిల్లాలో లక్ష రేషన్ కార్డులు ఇచ్చామని, ధాన్యం కొనుగోలులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు లక్షల 77 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని తెలిపారు. రానున్న మూడేళ్లలో ఎస్ఎల్బీ సీ టన్నెల్ ను తప్పనిసరిగా పూర్తి చేస్తామని, డిండి ప్రాజెక్టుకు రూ.1800 కోట్లు మంజూరు చేసి పనులు మొదలు పెట్టామని, అలాగే దేవరకొండ నియోజకవర్గం లో పెండ్లిపాకల, ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేసి పూర్తి చేస్తామని తెలిపారు. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ దేవరకొండ నియోజక వర్గానికి రహదారులు మంజూరు చేయాలని కోరారు.ఇటీవలే రూ. 254 కోట్లతో హ్యం రోడ్లు మంజూరు కాగా, రాష్ట్రవ్యాప్తంగా రూ.11 వేల కోట్లతో రోడ్లకు టెండర్లు పిలిచామని, దేవరకొండ ఏరియా ఆసుపత్రిని 100 పడకల నుంచి 200 పడకులకు స్థాయి పెంచాలని కోరారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ దేవరకొండ ఏరియా ఆసుపత్రిని 100 పడకల నుండి 200 పడకలకు పెంచాలని, దేవరకొండకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని మంజూరు చేయాలని, పెండ్లి పాకలతో పాటు ,ఇతర పెండింగ్ లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని పూర్తి చేయాలని, దేవరకొండ జూనియర్ కళాశాలకు నూతన బిల్డింగ్ మంజూరు చేయాలని, నియోజకవర్గంలో 30 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి పెంచడంతోపాటు, అవసరమైన చోట నూతన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేయాలని ,మైదాన ప్రాంతంలో ఐటిఐ మంజూరు చేయాలని, దేవరకొండలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఇదివరకే రూ.11 కోట్లు మంజూరు చేసినా అది మధ్యలోనే ఆగిపోయిందని , ఎస్డిఎఫ్ నిధులనుండి నిధులు మంజూరు చేసి దేవాలయం పూర్తిచేయాలని కోరారు. మైనార్టీ ఉర్దూ మీడియం పాఠశాల మంజూరు చేయాలని, నియోజకవర్గంలోని తండాల నుండి మండలాలకు, మండలం నుండి జిల్లా కేంద్రానికి రోడ్లు మంజూరు చేయాలని ,ఇందుకు రోడ్లకు నిధులు మంజూరు చేయాలని, కొత్తగా మంజూరైన మూడు మండలాలలో తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు భవనాలు ఇవ్వాలని, విద్యాపారంగా దేవరకొండను అభివృద్ధి చేయాలని ,మిషన్ భగీరథ ద్వారా డిండి , చందంపేట మండలాలలో తాగునీటిని సరఫరా చేయాలని ఆయన కోరారు .
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, మందుల సామెల్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు, తదితరులు ఉన్నారు. అనంతరందేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ రాష్ట్ర ముఖ్యమంత్రిని జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. అంతకుముందు ముఖ్యమంత్రి దేవరకొండ మున్సిపాలిటీలో రూ.13 కోట్ల వ్యయంతో వివిధ వార్డులలో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీలోని 7 ,9 ,10 వార్డులలో రూ.2.50 కోట్లతో మిగిలిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు . దేవరకొండ పట్టణంలో అన్ని వార్డులలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి డ్రైన్లకు, రూ.2 కోట్ల వ్యయంతో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ట్రాక్ తో సహా స్టేడియం అభివృద్ధి పనులకు,మరో రూ.2 కోట్ల వ్యయంతో 19వ వార్డులో ఉన్న బిఎన్ ఆర్ పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.11 కోట్ల 33 లక్షల 46 వేల విలువ గల బ్యాంకు లింకేజీ చెక్కులను మహిళ సంఘాలకు అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





