దేశానికి దిశ చూపేలా తెలంగాణ కులగణన

– రాహుల్‌గాంధీ హామీ మేరకు పకడ్బందీగా సర్వే
– జనగణనతోపాటు కులగణనకు సర్కార్‌ నిర్ణయం
– బిసి కోటా ఆమోదించేలా కేంద్రంపై పోరాటం
– తెలంగాణ కులగణనపై సీఎం రేవంత్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

న్యూదిల్లీ, జూలై 24: స్వాతంత్య్రం వొచ్చిన తర్వాత దేశంలో ఇప్పటివరకు కులగణన జరగలేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని భారత్‌ జోడో యాత్రలో తమ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన లక్ష్యం మేరకు తెలంగాణలో సమగ్ర కులగణనను చేపట్టామన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేపై దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ఎంపీలు, నేతలకు సీఎం రేవంత్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. రాహుల్‌ ఒత్తిడితోనే కేంద్రం దిగివచ్చి జనగణనతోపాటు, కులగణనకు అంగీకరించిందన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, కుల, రాజకీయ సర్వే 2024లో సమగ్రంగా జరిగిందని, ఇది 88 కోట్ల పేజీల్లో నిక్షిప్తమైందని అన్నారు. ప్రధాని మోదీకి బీసీలపై నిజమైన ప్రేమ లేదని, కొన్ని విషయాల్లో మోదీ సర్కార్‌ దిగివచ్చేలా రాహుల్‌గాంధీ పోరాటం చేశారని, ఆయన పోరాడినందువల్లే మూడు రైతు చట్టాలను కేంద్రం రద్దు చేసిందని పేర్కొన్నారు. కులగణన చేసేందుకు కూడా దిగి వొచ్చిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై సీఎం రేవంత్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ బీసీ కాదని, ఆయన కన్వర్టెడ్‌ ఓబీసీ అంటూ కామెంట్స్‌ చేశారు. కన్వర్టెడ్‌ అయిన మోడీ బీసీల కోసం ఏం చేయరని విమర్శించారు. బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ కుల గణనకు వ్యతిరేకమని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ మాటే తమకు లక్ష్మణ రేఖ అని స్పష్టం చేశారు. దేశానికి ఒక దిశను చూపించేలా కులగణన సర్వే చేశామని, తద్వారా కుల గణనపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. మొదటి నుంచి క్యాస్ట్‌ సెన్సస్‌కు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని తెలంగాణలో విజయవంతంగా కుల గణన పూర్తి చేసి మన దారిలోకి తీసుకొచ్చామని చెప్పారు. మొత్తానికి మోదీని రాహుల్‌ గాంధీ రూట్లోకి తీసుకురాగలిగామని, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త జనగణనలో కుల గణన చేయాలని నిర్ణయించడం రాహుల్‌ గాంధీ సక్సెస్‌ అని అన్నారు. తెలంగాణ మోడల్‌ను వివిధ రాష్ట్రాల్లో ఎంపీలు చెప్పాలనేదే తమ ఆలోచన అని, అందుకోసమే ఈ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ అని అన్నారు. కులగణన కేవలం సర్వేనే కాదని.. ఇది సొసైటి మెగా హెల్త్‌ చెకప్‌ అని అభివర్ణించారు. కుల గణన సర్వే ఆధారంగా తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామని, ఇందుకు ఉద్దేశించిన మూడు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించామని సీఎం పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఈ బిల్లుల ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఖర్గే ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్లో మీరు కొట్లాడండి.. బయట జంతర్‌మంతర్‌ దగ్గర మేం కొట్లాడుతామని చెప్పారు. కుల గణన సర్వేలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు వివరాలు ఇవ్వలేదని, వారి ముగ్గురిని తెలంగాణ జనాభా నుంచి తీసేశామని చెప్పారు. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ కులగణన సర్వే ఇవాళ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. రాహుల్‌ గాంధీ హామీ మేరకు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కులగణన చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా విభజించి సమగ్రమైన సర్వే నిర్వహించినట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *