తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌కు డ‌బ్ల్యూఈఎఫ్‌ మద్దతు

– రైజింగ్ 2047 విజన్‌లో భాగస్వామ్యం పంచుకుంటాం

– వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్  జెరెమీ జర్గెన్స్

దావోస్, ప్రజాతంత్ర, జనవరి 22: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డ‌బ్ల్యూఈఎఫ్‌) సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్  జెరెమీ జర్గెన్స్, సీ4ఐఆర్ నెట్‌వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతోపాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు నిర్వహించే ప్రతిపాదనలను చర్చించారు. ఏటా జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఫాలో-అప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. జనవరిలో జరిగే దావోస్ సదస్సులోని చర్చలు, తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించుకునేందుకు ఫాలో అప్ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం బృందం సానుకూలంగా స్పందించింది. వివిధ దేశాల నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్ తెలిపారు. చైనాలో ఏటా ‘సమ్మర్ దావోస్‌’ జరుగుతోందని, సౌదీ అరేబియా కూడా ఆసక్తి ప్రదర్శిస్తోందని చెప్పారు. సమావేశంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్, లక్ష్యాలను సీఎం వివరించారు. తెలంగాణ విజన్‌లోని విభిన్న కోణాలు పరస్పర సహకారానికి అవకాశం కల్పించేలా ఉన్నాయని జెరెమీ జర్గెన్స్ ప్రశంసించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో తాము భాగస్వామ్యం పంచుకుంటామన్నారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. స్కిల్ డెవెలప్మెంట్, స్పోర్ట్సుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. హైదరాబాద్‌లో జరిగిన బయోఏషియా 2024లో ప్రారంభించిన సీ4ఐఆర్ తెలంగాణ (సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్) పురోగతిపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ భారత్‌లో ప్రారంభించిన తొలి థీమాటిక్ సెంటర్ అదేనని గుర్తు చేశారు. సీ4ఐఆర్ ఆదర్శవంతమైన మోడల్‌గా గుర్తింపు సాధించిందన్నారు. పరిశ్రమల అభివృద్ధి ప్రణాళికలో ఉత్తమ పద్ధతులపై ఇది చేస్తున్న పరిశోధనల సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వంతో పంచుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రం అమలు చేస్తున్న మూడు జోన్ల నమూనాను విశ్లేషించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఏరోస్పేస్, డిఫెన్స్, బయో-డిజైన్, సాఫ్ట్?వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్కు ఉన్న అనుకూలతలను వివరించారు.

రూ.623 కోట్ల పెట్టుబడితో స్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ

రాష్ట్రంలో స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ తమ యూనిట్లను విస్తరించనుంది. శంషాబాద్ , గాగిల్లాపూర్ లోని రూ.623 కోట్ల పెట్టుబడితో విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డ‌బ్ల్యుఈఎఫ్‌–2026) లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్నైడర్ కంపెనీ సీఈవో దీపక్ శర్మతో సమావేశమయ్యారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులు, విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు, గ్రిడ్ ఆధునీకరణ, విద్యుత్ సామర్థ్యం పెంపు, ఇండస్ట్రీయల్ పార్కులు , పట్టణ మౌలిక వసతులకు డిజిటల్ విద్యుత్ నిర్వహణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ యూనిట్ల విస్తరణతో ఎలక్ట్రికల్ సేఫ్టీకి సంబంధించి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు, మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు, కాంటాక్టర్లు, పుష్ బటన్ల తయారీ సామర్థ్యం పెరుగనుంది. స్నైడర్ ఎలక్ట్రిక్‌కు తెలంగాణలోనే 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంలో కృషి చేసిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 2047 నాటికి నెట్ జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో పర్యావరణ పరిరక్షణ కీలకమని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంధన నిర్వహణ, ఆటోమేషన్, ఈవీ భాగాల తయారీలో స్మార్ట్ ఫ్యాక్టరీల విస్తరణపై మంత్రులు చర్చించారు. ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా తెలంగాణ ఎదిగిందని మంత్రులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *