విద్యా సంస్థల్లో ఇక ఫేషియల్‌ రికగ్నిషన్‌

– బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింత పెంచాలి
– ఒకే విభాగం కిందకు విద్యా శాఖ పరిధిలోని నిర్మాణాలు
– గ్రీన్‌ ఛానల్‌లో మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు
– విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధన సాగాలని, విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్‌ కోర్సులు బోధించే కళాశాలల్లో విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్‌ రికగ్నిషన్‌ తప్పనిసరి చేయాలన్నారు. దీనివల్ల హాజరు శాతం మెరుగుతోపాటు ప్రొఫెషనల్‌ విద్యా సంస్థల్లో లోటుపాట్లను అరికట్టవచ్చన్నారు. విద్యా శాఖపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యా శాఖ పరిధిలో అదనపు గదులు, వంట గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహారీల నిర్మాణం వివిధ విభాగాలు చేపట్టడం సరికాదని, ఈ నిర్మాణాల నాణ్యతా పమాణాలు, నిర్మాణ పర్యవేక్షణ, నిధుల మంజూరు, జవాబుదారీతనానికి ఒకే విభాగం కింద ఉండాలని అన్నారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ (ఈడబ్ల్యుఐడీసీ) కిందనే ఈ నిర్మాణాలు కొనసాగాలని సీఎం ఆదేశించారు. ఈ సంస్థకు అవసరమైన ఇంజినీరింగ్‌, ఇతర సిబ్బందిని ఇతర విభాగాల నుంచి వెంటనే డెప్యుటేషన్‌పై తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపును గ్రీన్‌ ఛానల్‌లో చేపట్టాలని, ఈ విషయంలో ఎలాంటి అలసత్వం చూపొద్దని సీఎం అన్నారు. మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. కంటైనర్‌ కిచెన్లకు ప్రాధాన్యమివ్వాలని, కంటైనర్లపైన సోలార్‌ ప్యానెళ్లతో అవసరమైన విద్యుత్‌ వినియోగించుకోవచ్చని సీఎం తెలిపారు. ప్రతి పాఠశాలలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అవసరమైతే కాంట్రాక్టు పద్ధతిన వ్యాయామ ఉపాధ్యాయులను నియమించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద పాఠశాలల్లో పారిశుధ్య పనులకు సంబంధించిన బిల్లులు తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని బాలికలకు వివిధ అంశాలపై కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు మహిళా కౌన్సెలర్లను నియమించాలన్నారు.

విద్యా రంగంపై పెడుతున్న ఖర్చును తాము ఖర్చుగా కాక పెట్టుబడిగా చూస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. యంగ్‌ ఇండియా ఇంటెగ్రేటెడ్‌ రెసిడెన్షియల్స్‌ స్కూళ్లతోపాటు విద్యా రంగం అభివృద్ధికి తీసుకునే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలో లేకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న వారిలో 90 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారని, దీన్ని నిర్ధారించేందుకు గత పదేళ్లలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారి వివరాలపై నివేదిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌ రెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *