– దాటడానికి ప్రయత్నిస్తే ఏ నౌకనైనా పేల్చేస్తాం
– ఇరాన్ హెచ్చరికతో చమురు సంక్షోభం
టెహ్రాన్, మార్చి 3: పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే ముడిచమురు ధరలు పెరుగుతుండగా.. ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ మరింత ఆందోళనకు దారితీస్తోంది. హోర్ముజ్ జలసంధిని మూసివేశామని, నౌకలు దానిని దాటడానికి ప్రయత్నిస్తే ఏ నౌకపైనైనా కాల్పులు జరుపుతామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ సలహాదారు ఇబ్రహీం జబారీ ప్రకటించారు. నౌకలు ఈ జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే దాడి చేస్తామని పేర్కొన్నట్లు అధికారిక మీడియా వెల్లడించింది. దీంతో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని కెప్లర్ గణాంకాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. హోర్ముజ్.. ప్రపంచ ఇంధనానికి జీవనాడి వంటిది. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో ఐదోవంతు రవాణా అవుతోంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయం అయినా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజలాడిస్తుంది. ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎల్‌ఎన్‌జీ అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతాయి. ఇంతటి కీలకమైన జలసంధిని మూసివేస్తే రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోంది. చమురు ధరలు భగ్గుమంటున్నాయి. కాగా, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో తమ సుప్రీం నేత ఖమేనీ మృతితో ఇరాన్ రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే హోర్ముజ్‌ను మూసివేసినట్లు ప్రకటించింది. డేటా అండ్ అనలిటిక్స్ సంస్థ కెప్లర్ గణాంకాల ప్రకారం సుమారు 150 ఆయిల్ ట్యాంకర్లు ఇప్పటికే ఈ హోర్ముజ్ నుంచి వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు హోర్ముజ్ తూర్పువైపున 60 ట్యాంకర్లు వేచిచూస్తున్నాయి. ఇదిలాఉంటే, ఫిబ్రవరి మధ్యలో సైనిక విన్యాసాల కోసం జలసంధిలో కొంతభాగాన్ని ఇరాన్ మూసివేయగా అప్ప్పుడు చమురు ధరలు 6 శాతం మేర పెరిగాయి.
విరుచుకుపడుతున్న ఇరాన్ : యూఎస్ ఎయిర్‌బేస్ ధ్వంసం
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్- అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ప్రాంతంలోని అమెరికా ఎయిర్‌బెస్‌ను ధ్వంసం చేశామని ఇరాన్ మంగళవారం ప్రకటించుకుంది. డ్రోన్లు, క్షిపణులతో కమాండ్ సెంటర్, కేంద్ర కార్యాలయాన్ని దెబ్బతీశామని వెల్లడించింది. 20 డ్రోన్లు, మూడు క్షిపణులతో టార్గెట్లను ఢీకొట్టాం. దాంతో ఆ ప్రాంతంలో ఇంధనాన్ని నిల్వ చేసే ట్యాంకులకు మంటలు అంటుకొని ఆ ప్రాంతమంతా పొగ అలముకుందని ఇరాన్ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్‌లోని రమాత్ డేవిడ్ ఎయిర్‌బేస్‌పై దాడి జరిగినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది. రాడార్ కేంద్రాలు, కంట్రోల్ రూమ్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. అందుకోసం డ్రోన్ల గుంపును పంపినట్లు పేర్కొంది. ఇదిలాఉంటే బీరుట్ దక్షిణ ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు చేసింది. ఎరుపు రంగు మార్కింగ్‌లో ఉన్న భవనాలు, ఆ పక్కనే ఉన్న ఇళ్లను తక్షణమే ఖాళీ చేయాలి.. కనీసం 300 మీటర్లు దూరంగా వెళ్లండి.. ఆ భవనాలన్నీ హెజ్‌బొల్లా స్థావరాలకు దగ్గర్లో ఉన్నాయని ఇజ్రాయెల్ తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



