మల్లన్న సాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఘర్షణ

– హరీష్ రావు గోబ్యాక్ అంటూ నినాదాలు
– పోలీసుల లాఠీచార్జ్
-» కాంగ్రెస్ చీప్ ట్రిక్కులు: హరీష్ రావు విమర్శ

సిద్దిపేట, ప్రజాతంత్ర ఫిబ్రవరి 7: గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రాజకీయ విమర్శలతో మొదలై, చివరకు మల్లన్నసాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఘర్షణల వరకు చేరింది. ఒకవైపు మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్- బీజేపీలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రచారం సాగించగా, మరోవైపు పునరావాస బాధితులు ఆగ్రహంతో ఆయనను అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి పోలీసుల లాఠీచార్జ్ వరకు వెళ్లింది. తీవ్ర ఉదృతల నడుమ ఇరు పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. శనివారం గజ్వేల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న హరీశ్ రావు, సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ నేతల వ్యాఖ్యలన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గజ్వేల్కు నయా పైసా అభివృద్ధి జరగలేదని, గుంతల రోడ్లను కూడా పూడ్చలేని పరిస్థితి ఉందన్నారు. మిషన్ కాకతీయపై బీజేపీ ఎంపీ చేసిన రూ.50 వేల కోట్ల అవినీతి ఆరోపణలను ఖండిస్తూ, వాస్తవ వ్యయం కేవలం రూ.5 వేల కోట్లేనని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్ భూముల ధరలు కోట్లకు పెరిగితే, రేవంత్ పాలనలో బంగారం ధర పెరిగి భూముల విలువలు పడిపోయాయని విమర్శించారు. బీజేపీ పాలలో జీఎస్టీ, పాల ధరలు పెంచడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదనీ అన్నారు. కరోనా సమయంలో మేమే ప్రజల మధ్య ఉండి ప్రజలకు అండగా నిలిచామని అన్నారు. ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత ఒత్తిడి చేసినా గజ్వేల్ ప్రజలు బీఆర్ఎస్ కే ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బి ఆర్ ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, స్థానిక నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని మల్లన్నసాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీ (ఏటిగడ్డ కిష్టాపూర్)లో హరీశ్ రావు ప్రచారానికి వస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు, పునరావాస బాధితులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కొందరు భూ నిర్వాసితులు ఆర్థిక సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రా జెక్టులో ముంచారు… భూములు పోయాయి… మేము రోడ్డున పడ్డాం అంటూ ప్రజలు ఆగ్రహానికి లోనయ్యారు. ప్రచారం మొదలుకాగానే “హరీశ్ రావు గో బ్యాక్” అంటూ నినాదాలు మార్మోగాయి. ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి పరస్పరం చెప్పులు విసిరుకునే స్థాయికి చేరింది. పరిస్థితి అదుపుతప్పడంతో సీఐల రవికుమార్, రవిరాజు, ఆధ్వర్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి జనాలను చెదరగొట్టారు. అనంతరం బీఆర్ఎస్ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి పునరావాస కాలనీలో కౌన్సిలర్ అభ్యర్థులతో ప్రచారం కొనసాగించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *