– ముస్లింల విషయంపై దాటవేత తగదు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
జనగామ, ప్రజాతంత్ర, ఆగస్టు 7: కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఒక్క శాతం కూడా తగ్గించకుండా అమలు చేస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు డిమాండ్ చేశారు. అది చెప్పకుండా గుజరాత్, యూపీలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు అనే సాకులు చెప్పడం తగదన్నారు. జనగామలో జరిగిన పార్టీ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తాము ముస్లింలకు వ్యతిరేకం కాదు.. వారికి విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదు.. కానీ ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలకు నష్టం జరుగుతుందని, ప్రస్తుతం ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లపై కోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 50 డివిజన్లు బీసీలకు కేటాయించగా, వాటిలో 35 సీట్లు ఎంఐఎం ముస్లింలు గెలిచారు. దీని వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ తీసుకొచ్చే 10 శాతం ముస్లిం రిజర్వేషన్లకు మాత్రమే తాము వ్యతిరేకమని చెప్పారు. మాట మార్చడమే కాంగ్రెస్ పార్టీ నైజమన్నారు. 19 నెలలు గడిచినా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సింది. బీసీ బిల్లుకు బీజేపీ అసెంబ్లీలో పూర్తిగా మద్దతు తెలిపిందని, మరి కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు ఓబీసీల హక్కులతో చెలగాటమాడుతోంది అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ టైమ్ ఇవ్వడంలేదంటున్నారు.. కానీ అసలు రేవంత్‌కు టైమ్ ఇవ్వనిది రాహుల్ గాంధీనే అన్నారు. దిల్లీలో జరిగిన కాంగ్రెస్ ధర్నా అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. ఇది పంటల సాగు సీజన్. రైతులు ఇబ్బందుల్లో ఉంటే వారిని పట్టించుకోకుండా దిల్లీలో ధర్నా పేరుతో డ్రామా చేయడానికి వెళ్లారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి కేసుల్లో ఎవరినీ ఇప్పటివరకు అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతలను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులను సీబీఐ విచారణకు అప్పగించడం లేదని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు అన్ని సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని, అధిక స్థానాల్లో గెలుస్తుందని స్పష్టం చేశారు. గ్రామీణ పేదలకు ఉచిత బియ్యం, ఇండ్లు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు, రూ.5 లక్షల ఉచిత వైద్యం, పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకు రుణాలు, యువతకు స్వయం ఉపాధి రుణాలు ఇవన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని, గ్రామాల్లో రోడ్లు, మరుగుదొడ్లు, వీధి దీపాలు, స్మశానవాటికలు, రైతు వేదికలు, హరితహారం కింద మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అమలవుతున్నాయని రామచందర్‌రావు తెలిపారు. 6 గ్యారంటీల పేరుతో 420 మోసాలకు పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.





