సివిల్స్ అభ్య‌ర్థుల‌కు స‌హాయం అందిస్తాం

– ఎంత‌మందైనా ఇబ్బంది లేదు
– సింగ‌రేణి ఆధ్వ‌ర్యంలో ప‌థ‌కం అమ‌లు
– ఈ ఏడాది మెయిన్‌కు 202 మంది ఎంపిక‌
– ఇంట‌ర్వ్యూకు వెళ్లేవారి సంఖ్య 100 దాటాలి
– డిప్యూటీ సి.ఎం భ‌ట్టి విక్ర‌మార్క‌
హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 4:  రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్ సర్వీసెస్ మెయిన్స్, ఇంటర్వ్యూ లకు ఎంతమంది ఎంపికైనా ఆర్థిక సహాయం అందిస్తామ‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం ఆయన ప్రజా భవన్ లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన 50 మందికి చెక్కులు అందించిన అనంతరం ప్రసంగించారు. సివిల్ సర్వీసుల్లో విజయం సాధించిన వారికి అభినంద‌న‌లు తెలిపారు. రాష్ట్రం నుంచి ఎంత మంది ఎక్కువ ఎంపిక అయితే రాష్ట్రానికి అంత మంచిదని భావించి ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నామ‌న్నారు. అపారమైన మేధస్సు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఎంపిక కాలేకపోతున్నారన్న సమాచారం తెలుసుకొని ఆ ఇబ్బందులు తీర్చేందుకు సింగరేణి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని తీసుకువచ్చామని వివరించారు. మెయిన్స్ కు ఎంపికైన వారికి లక్ష రూపాయలు ఆ తర్వాత ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పిస్తున్నట్టు వివరించారు.  మొదటిసారి 140 మంది మెయిన్స్ కు ఎంపిక కాగా అందులో 20 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారని వివరించారు. వారికి రెండు దశల్లోనూ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించామని అన్నారు. గత సంవత్సరం 20 మంది ఇంటర్వ్యూ కు వెళ్లగా అందులో ఏడుగురు సివిల్ సర్వీసెస్ కు ఎంపిక కావడం అభినందనీయమ‌న్నారు. ఏడుగురికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ శుభాకాంక్షలు తెలియజేస్తుందని అన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువమంది సుమారు 202  మంది మెయిన్స్ కు ఎంపిక కాగా అందులో 50 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారని తెలిపారు. గత సంవత్సరం 20 మంది ఇంటర్వ్యూకు ఎంపిక కాగా ఈసారి 50 మంది ఇంటర్వ్యూకు ఎంపిక కావడం అభినందనీయమని వచ్చేసారి ఈ సంఖ్య 100కు దాటి వెళ్లాలని అన్నారు. మెయిన్స్ కు ఎంపికైన 50 మందికి రొటీన్ గా చెక్కులు అందజేయవచ్చు కానీ వారి అభిప్రాయాలు తెలుసుకొని భవిష్యత్తులో మరింతగా ఈ పథకాన్ని తీర్చిదిద్దేందుకు వారి అభిప్రాయాలు తెలుసుకోవాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంటరాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేసింద‌న్నారు. మీరు స్థిర‌ప‌డిన త‌ర్వాత స‌మాజం ప‌ట్ల బాధ్య‌త‌గా వుండాల‌న్నారు. ఇంటర్వ్యూ కు వెళ్లే సమయంలో ఢిల్లీలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సహాయం అందించేందుకు అక్కడ ప్రత్యేక ప్రతినిధులు ఉంటారని తెలిపారు. ప్రభుత్వంలోని సీనియర్ బ్యూరోక్రాట్లతో ఇంటర్వ్యూ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీతో చర్చించినట్టు వివరించారు. ఇంటర్వ్యూ కు వెళ్లే అభ్యర్థులు విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేయాలని రేవంత్ రెడ్డి తనకు చెప్పారని వివరించారు. ఇంటర్వ్యూకు వెళ్లే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం యావత్తు మద్దతుగా ఉంటుందని విజయం సాధించి రావాలని కోరారు. సివిల్స్ ఇంట‌ర్వ్యూల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాకర్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ముందుగా సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ పేద వర్గాల నుంచి కూడా అభ్యర్థులు సివిల్స్ పరీక్షల్లో విజేత‌లుగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన సివిల్స్ అభయహస్తం పథకానికి సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. మొదటి ఏడాది మంచి స్పందన లభించిందని, రెండో ఏడాది రెట్టింపు స్పందనతో పాటు ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఫైనల్స్ కు ఎంపిక‌వ‌డం అభినందనీయమన్నారు. సంస్థ డైరెక్టర్ పర్సనల్  గౌతమ్ పొట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్‌ మూమెంట్ బి.వెంకన్న ఫైనల్ ఇంటర్వ్యూలకు ఏ విధంగా సంసిద్ధం కావాలనే అంశంపై సూచనలు చేశారు. తెలంగాణ సంస్కృతిని ప్ర‌తిబింబించేలా రూపొందించిన సింగ‌రేణి బ్రాండ్ శాలువాను రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి ఆవిష్క‌రించారు. అలాగే సింగ‌రేణి జ్ఞాపిక‌ను ఆవిష్క‌రించారు. ఇక‌పై సింగ‌రేణి అధికారిక కార్య‌క్ర‌మాల్లో వీటిని ఉప‌యోగిస్తామ‌ని, తెలంగాణ రైజింగ్ కార్య‌క్ర‌మాల సంద‌ర్భంగా సింగ‌రేణి అభివృద్ధి, తెలంగాణ సంస్కృతిని ప్ర‌తిబింబించాల‌న్న ఉద్దేశంతోనే వీటిని రూపొందించిన‌ట్లు సీఎండీ బ‌ల‌రామ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్, మార్కెటింగ్ తాడబోయిన శ్రీనివాస్  త‌దిత‌రులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *