ఫిలిప్పిన్స్‌కు బియ్యం .. అదో పెద్ద స్కాం

– అడ్వైజర్ సలహాతో నష్టం జరిగిందా లేదా?
– సమాధానం చెప్పాలన్న మాజీ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న ప్రేమ్‌చంద్ గార్గ్ అనే వ్యక్తిని బియ్యం ఎగుమతులకు అడ్వైజర్‌గా పెట్టుకున్నది నిజమా కాదా చెప్పండంటూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీశారు. ఈ అడ్వైజర్ ఇచ్చిన సలహా వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం నిజమా కాదా అని ప్రశ్నించారు. పది లక్షల మెట్రిక్ టన్నులు పిలిప్పిన్స్‌కు ఎగుమతి చేస్తాం అని ఎంఓయూ చేసుకున్నాం అని, ఇదేదో పెద్ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అని, తమ విజయం అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నది.. ఇప్పుడు అదొక పెద్ద స్కాంగా మారింది అని ఆరోపించారు. 10లక్షల టన్నుల ఎగుమతికి ఎంఓయూ చేసుకున్న మీరు 22,750 టన్నుల దగ్గరే ఎందుకు ఆగిపోయారు.. మరో 7,500 టన్నులు ఏడాది నుంచి కాకినాడ పోర్టులో పురుగులు పడి ముక్కిపోయి ఉన్న మాట వాస్తవమా? కాదా అని నిలదీశారు. ఏడాది నుంచి పోర్టులో ఎందుకు ఉన్నాయి.. ఎందుకు మీ ఎగుమతి ఆగిపోయింది? సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న మీ అడ్వైజర్ ఎక్కడ పోయిండు? వాటాలు తేలకపోవడమే ఎగుమతి ఆగిపోవడానికి కారణమా అని ప్రశ్నించారు. అధ్యక్షా.. ఈ సివిల్ సప్లైలో జరిగిన అన్ని కుంభకోణాలపై హౌజ్ కమిటీ వేయండి ఆధారాలతో నిరూపిస్తాం అని అన్నారు. మీ పాలన పారదర్శకంగా ఉన్నదని మీరు భావిస్తే, మీరు తప్పు చేయకపోతే హౌజ్ కమిటీకి ముందుకు రండి. లేదంటే మీరు తప్పు చేసినట్లుగానే రాష్ట్ర ప్రజలు భావిస్తారు. రేపు తాము అధికారంలోకి వచ్చాక ఈ కుంభకోణాలపై విచారణ జరిపించేది ఖాయం అని హరీష్‌రావు హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *