రాష్ట్రంలో సినిమాల తయారీ ఇక సులభతరం

– అన్ని అనుమతులకు వెబ్‌సైట్‌ రూపకల్పన
– ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 : రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణ, అందుకు కావాల్సిన పలు అనుమతులు, థియేటర్ల నిర్వహణకు పొందాల్సిన అనుమతులు, సినీ రంగ అభివృద్దికి కావాల్సిన అనుమతులన్నీ ఒకే విండో ద్వారా పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ రూపొందిస్తోంది. ఈ వెబ్‌సైట్‌ ‘ఫిలిమ్స్‌ ఇన్‌ తెలంగాణ’పై సంబంధిత శాఖలు, ఫిలిం ఇండస్ట్రీ ప్రతినిధులతో సోమవారం ప్రత్యేక వర్క్‌షాప్‌ జరిగింది. బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలో జరిగిన ఈ వర్క్‌షాప్‌నకు ఫిలిం డెవలమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌ రాజు, ఎఫ్‌డీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సిహెచ్‌ ప్రియాంక, టూరిజం కార్పొరేషన్‌ ఎండీ వల్లూరు క్రాంతి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, చిత్ర పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా దిల్‌ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్ని రకాల చేయూతనిస్తున్నారని, ఈ సదవకాశాన్ని సినీ పరిశ్రమ పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్‌తో వస్తే సినిమా నిర్మాణానికి కావాల్సిన షూటింగ్‌ లొకేషన్లు, వివిధ శాఖలనుండి కావాల్సిన అనుమతులు, సినీ నిర్మాణానికి సంబందించిన సాంకేతిక విభాగాలు, టెక్నీషియన్లు, హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో అందుబాటులో ఉన్న హోటళ్ల సంపూర్ణ సమాచారంతో ఈ వెబ్‌సైట్‌ రూపొందిస్తున్నామన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఈవిధమైన సౌలభ్యం మొట్టమొదటిసారిగా తెలంగాణలో మాత్రమే రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. దీంతోపాటు సినిమా థియేటర్ల నిర్వహణకు కావాల్సిన బీ-ఫామ్‌ జారీ విధానాన్ని కూడా ఆన్‌ల్లైన్‌ ద్వారా పొందే సులభతర విధానాన్ని ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. థియేటర్ల నిర్వహణకు ఇప్పటివరకు నగరాల్లో అయితే సంబంధిత పోలీసు కమిషనర్లు, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో అయితే ఆయా జిల్లాల అడిషనల్‌ కలెక్టర్లు జారీ చేసేవారని, ఇకపై ఈ అనుమతులన్నింటినీ ఆన్‌ల్లైౖన్‌ విధానం ద్వారా జారీ చేయడానికి రాష్ట్ర హోమ్‌ శాఖతో చర్చించి విధివిధానాలు రూపొందిస్తామని వెల్లడిరచారు. ఈ వెబ్‌సైట్‌ రూపకల్పనకు సంబంధించి తగు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా చిత్ర పరిశ్ర ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులను దిల్‌రాజు కోరారు. ఈ వెబ్‌సైట్‌ను పూర్తిస్థాయిలో రూపొందించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో ప్రారంభిస్తామని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *