-హైడ్రా జోక్యంతో పరిష్కారం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: హైదరాబాద్‌లోని చట్నీస్ పంజాగుట్ట బ్రాంచ్‌లో దశాబ్ద కాలంగా నెలకొన్న వివాదానికి హైడ్రా అధికారులు తెరదించారు. చట్నీస్ హోటల్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా మూసివేసిన మెట్ల మార్గాన్ని హైడ్రా అధికారులు గురువారం తెరిపించారు. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యపై హైడ్రా తీసుకున్న నిర్ణయం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. పంజాగుట్టలోని చట్నీస్ హోటల్ నిర్వాహకులు భవనంలోని పై అంతస్తులకు వెళ్లే మెట్ల మార్గాన్ని నిబంధనలకు విరుద్ధంగా మూసివేసి అడ్డంకులు సృష్టించారని బాధితులు ఆరోపించారు. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ సమయం నుంచి పైఅంతస్తుల్లోని ఇతర యజమానులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకున్నారని తెలిపారు. పదేళ్లుగా భవనంలోని ఇతర యజమానులు తమ వ్యాపారాలకు, రాకపోకలకు ఆటంకం కలుగుతోందని జీహెచ్‌ఎంసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని తెలిపారు. అయితే ఈ సమస్యపై బాధితులు ఇటీవల హైడ్రా అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన హైడ్రా బృందం ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వెంటనే మెట్ల మార్గాన్ని తెరిపించారు. హైడ్రాతో తమ సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అయిందంటూ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





