‘తెలంగాణ రైజింగ్‌’ లక్ష్యసాధనలో చిన్నారులే కీలకం

– మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ప్రతి చిన్నారికీ ఆరోగ్యకరమైన, సంతోషకరమైన బాల్యం అందించడానికి మిషన్‌ వాత్సల్య ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. నేటి బాలలే రేపటి తెలంగాణ భవిష్యత్తు పౌరులని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించిన తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్య సాధనలో వీరిది కీలక పాత్ర అని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా సిబ్బంది నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీలు, జువైనల్‌ జస్టిస్‌ బోర్డు సభ్యుల నియామకానికి దరఖాస్తుల గడువు ఈ నెల 8తో ముగిసినప్పటికీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రానందున గడువు పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలించి న్యాయపరమైన సలహా తీసుకొని తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి అనసూయ సీతక్క అధ్యక్షతన బాలల హక్కుల కమిషన్‌ కార్యకలాపాలపై సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. సమావేశానికి బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌ రెడ్డి, సభ్యులు, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, డైరెక్టర్‌ సృజన, సంబంధిత అధికారులు హాజరయ్యారు. బాలల హక్కుల కమిషన్‌ ఏర్పాటైన నాటినుండి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన చర్యలు, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన వనరులపై చర్చించారు. జిల్లాస్థాయిలో మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి మరింత సహకారం అందించాలని కమిషన్‌ విజ్ఞప్తి చేసింది. క్షేత్రస్థాయిలో బాలల హక్కుల కమిషన్‌ మరింత క్రియాశీలకంగా పనిచేయడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *