– వివిధ శాఖల కార్యదర్శులతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్
హైదరాబాద్, ఆగస్టు 28 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక నివేదికను వెంటనే సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాలపై వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో గురువారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, వికాస్‌రాజ్, సబ్యసాచి ఘోష్, ముఖ్య కార్యదర్శులు రాహుల్ బొజ్జ, రఘునందన్ రావు, శ్రీధర్, డీజీపీ, అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధానంగా నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాలు అధికంగా నష్టాన్ని చవిచూశాయని, వీటితోపాటు ఇతర జిల్లాల్లో కూడా గణనీయమైన నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ నష్టాలకు సంబంధించి ప్రాథమిక నివేదికను వెంటనే సమర్పించాలన్నారు. వీటితోపాటు జరిగిన నష్టాలను తెలియచేసే ఫోటోలు, వీడియో క్లిప్పింగులు, పత్రిక క్లిప్పింగులు కూడా జతపర్చాలన్నారు. వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత జిల్లా కలెక్టర్లు నష్టాలపై పంపిన ఈ ప్రాథమిక నివేదికలను సంకలనం చేయాలని విపత్తుల నిర్వహణ శాఖకు తెలిపారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, చెరువులు, విద్యుత్ లైన్లను యుద్ధప్రాతిపదికన పునరుద్దరించాలని రామకృష్ణారావు ఆదేశించారు. వర్షాలు మరికొన్ని రోజులు వచ్చే అవకాశం ఉన్నందున మరింత అప్రమత్తతతో ఉండాలని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు నిబంధనలననుసరించి ఎక్స్‌గ్రేషియాను అందచేయాలన్నారు. ముఖ్యమంత్రి నిర్వహించే పూర్తిస్థాయి సమీక్షకు ఆయా శాఖలన్నీ వివరాలతో, తీసుకున్న చర్యల నివేదికలతో సిద్ధంగా ఉండాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.



