అదే రోజు యాదాద్రిలో సీఎం రేవంత్ పూజలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : ఈ నెల 8న తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి క్షేత్రంలో పూజలు చేయనున్నారు. అదే రోజు మూసీ పరీవాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేసే అవకాశం ఉంది. భువనగిరి నుంచి వలిగొండ వైపు పాదయాత్ర చేయనున్నారని సమాచారం. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల పైపులైన్లకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మూసీ కోసం పాదయాత్ర చేస్తానన్న సిఎం రేవంత్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల పైపులైన్లకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని రైతులు, ప్రజలను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. సీఎం పర్యటన క్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హెలిప్యాడ్, ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. అటు,మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఆయనతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు చర్చించారు.





