- తెలంగాణ ఉద్యమంలో చర్రిత వక్రీకరణకు గురైంది..
- రాజకీయ లబ్ధి పొందిన వారికే పేరొచ్చింది..
- హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : తమ కలం, గళం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయడంతో పాటు ప్రజా పోరాటాలు చేసిన కవులు, కళాకారులను ఎన్నటికీ మర్చిపోవద్దని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను గురువారం ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనంతరం మాట్లాడారు. కవులు, కళాకారుల పేర్లను బుక్ ఫెయిర్ వేదికలకు పెట్టడం ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చారని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు పోరాటంలో అమరులైన వారి గురించి చరిత్రలో కొంత నిర్లక్ష్యం జరిగిందని అన్నారు.సాయుధ రైతాంగ పోరాటం, తొలి , మలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా చర్రిత కొంత వక్రీకరణకు గురైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సమిదలైన వారి కంటే రాజకీయ ప్రయోజనం పొందిన వారికే ఎక్కువ పేరు వొచ్చిందని తెలిపారు. . తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో చేసిన వారి పేర్లు చరిత్రలో ఉండాలి అని అన్నారు. చదివిన పుస్తకాలు, చైతన్య పర్చిన గానం నుంచి క్రోడీకరించి తాను ఉమ్మడి ఎపీ అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై మాట్లాడాను. సాంకేతిక పరిజ్జానం పెరగడంతో డిజిటల్ మీడియా కారణంగా పుస్తకాల ప్రాధాన్యత తగ్గిపోతోంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను నిర్వహించడం ద్వారా వొచ్చే తరానికి స్పూర్తినిస్తున్నారు.
చరిత్ర చదువుకుంటూనే భవిష్యత్తు తరాలకు మంచి సందేశం ఇవ్వగలం. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. మంచి సందేశం ఇవ్వడం కోసమే బుక్ ఫెయిర్ లో తనతోపాటు మంత్రులం పాల్గొన్నామన్నారు. సామాజిక చైతన్యం , సమాజంలో వొచ్చే మార్పులపై చర్చించడానికి బుక్ ఫెయిర్ మంచి వేదికగా ఉంటుందన్నారు. కొత్త తరానికి తెలిసింది గూగుల్ మాత్రమే.. చరిత్రకారులు రాసిన పుస్తకాలు చదవడం ద్వారా చరిత్రలో కనుమరుగైన వారికి చరిత్ర తెలుస్తుంది.. పోరాడి అమరులైన వారి గురించి చరిత్ర కారులు రాస్తేనే తెలుస్తుంది.. తమకనుకూలంగా రాయించుకున్న చరిత్రనే అసలైన చరిత్ర అని గత పదేళ్ల నుంచి కొందరు ప్రచారం చేయించుకుంటున్నారు.
చరిత్రకారులను గుర్తించుకోవడం కోసమే తెలుగు యూనివర్సిటీ కి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకున్నాం.. కాళోజీ, దాశరథి లాంటి కవులెందరో తెలంగాణ తొలి ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చారు.. అందె శ్రీ, గూడ అంజయ్య, గద్దర్ లాంటి వారు మలి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చారు.. నిజమైన చరిత్రను తెలియజేయడానికి ఏర్పాటైన పుసక్త ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర గ్రంథాలయ శాఖ బుక్ స్టాల్ ,టి సాట్ స్టాల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణ రావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం, సుప్రీమ్ కోర్టు మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొ .రమా మేల్కొటే, సీనియర్ ఎడిటర్ కె రామచంద్ర మూర్తి తదితరులు పాల్గొన్నారు.





