– ఈ మాత్రం సంస్కరణలకు ఎనిమిదేళ్ల కాలయాపన
– ఘాటుగా వమర్శలు చేసిన చిదంబరం
న్యూదిల్లీి,సెప్టెంబర్ 4: వస్తు సేవల పన్నుపై కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లూ తప్పుదోవలో వెళ్లిందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం విమర్శించారు. ఆ తప్పును గ్రహించి తాజాగా యూటర్న్ తీసుకుందన్నారు. ఈనెల 22 నుంచి 5, 18 శాతాల శ్లాబులు తీసుకొస్తున్నామని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో చిదంబరం స్పదించారు. జీఎస్టీ హేతుబద్ధీకరణ, రేటు తగ్గించడాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎనిమిదేళ్లు పట్టడం చాలా ఆలస్యమేనని పేర్కొన్నారు. జీఎస్టీ రూపకల్పన సరిగా లేదని కాంగ్రెస్ సహా పలువురు ఆర్థికవేత్తలు గతంలోనే ప్రశ్నించారన్నారు. మధ్యతరగతి, పేద ప్రజలు ఈవిషయంపై గొంతెత్తినా ప్రభుత్వం వినిపించుకోలేదని ఆరోపించారు. జీఎస్టీ ఎల్లప్పుడూ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్‌లా ఉండాలని చిదంబరం ఆకాంక్షించారు. తాజా నిర్ణయంతో పేద, మధ్యతరగతి వర్గాలకు కొంత ఉపశమనం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. లోపభూయిష్టమైన జీఎస్టీ డిజైన్, సంక్లిష్ట శ్లాబులను ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలుమార్లు సమర్థించుకున్నారని, నిన్నటి మార్పులకు వారే చప్పట్లు కొట్టుకోవడం గమనించాల్సిన విషయమని అన్నారు. వృద్ధి మందగించడం, గృహ రుణాలు పేరుకుపోవడం, పొదుపు క్షీణించడం, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ట్రంప్ టారిఫ్‌లే జీఎస్టీ రేట్ల మార్పునకు కారణమా అని ప్రశ్నించారు. అసలైన జీఎస్టీ 2.0 కోసం ఎదురు చూస్తున్నానని కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. జీఎస్టీ 1.5 సంస్కరణలు బాగున్నాయన్నారు. తమ ఆదాయాలను రక్షించుకోవడానికి మరో ఐదేళ్లు పరిహారం పొడిగించాలని రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్ ఇంకా మిగిలే ఉందని గుర్తు చేశారు. నూతన జీఎస్టీ ప్రైవేటు పెట్టుబడులకు ఊతమిస్తుందా.. ఎంఎస్‌ఎంఈలపై భారాన్ని తగ్గిస్తుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానమివ్వాలన్నారు. జీఎస్టీ 1.0 తుది అంకానికి చేరిందనే విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఎట్టకేలకు గుర్తించారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





