జర్నలిస్టుల పాత్ర గొప్పది

– మంత్రి దనసరి అనసూయ సీతక్క

హైదరాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి జర్నలిస్టులు విశేషంగా కృషి చేశారని, కొన్ని యాజమాన్యాలు వ్యతిరేకించినా జర్నలిస్టులు వెనక్కి తగ్గలేదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పనిచేస్తారని, ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకొచ్చి వాటిని పరిష్కరింపచేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని అన్నారు. నాంపల్లిలోని మీడియా అకాడమీ భవనంలో జర్నలిజం వృత్తిలో అమరులైన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సిహెచ్‌.ప్రియాంకలతో కలిసి మంత్రి సీతక్క చెక్కులు పంపిణీ చేశారు. ఇటీవల మరణించిన 18 మంది జర్నలిస్టు కుటుంబ సభ్యులకు రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని, విధి నిర్వహణలో భాగంగా మరణించిన జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమాన్ని ప్రభుత్వం బాధ్యతగా స్వీకరిస్తుందని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు శిక్షణతోపాటు చికిత్స, దురదృష్టవశాత్తు మరణిస్తే ఆర్థిక చేయూత అందిస్తున్నామన్నారు. జర్నలిస్టు కుటుంబం ఒంటరిది కాదు అని చెప్పడానికి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నామన్నారు. జర్నలిస్టులంతా విశ్వసనీయత పెరిగేలా సమాచారం అందించాలని, నిజమైన వార్త వ్యక్తిగత ప్రయోజనాలను కాకుండా ఎల్లప్పుడూ సామాజిక ప్రయోజనాన్ని కోరుకుంటుందని వ్యాఖ్యానించారు. ఆ విధానాన్ని అంతా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నానన్నారు. ఇల్లు లేని జర్నలిస్టులకు ఇంటి సదుపాయం కల్పించాలని జర్నలిస్టులు కోరుతున్నారని, సీఎం దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టులకు ఇండ్లను కేటాయిస్తామని, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్‌ కార్డులు మంజూరు చేస్తామని, మరణించిన జర్నలిస్టు కుటుంబంతో అనుబంధాన్ని కొనసాగిస్తామని చెప్పారు. వారి కుటుంబాలకు తోడుగా, తోబుట్టువుగా అండగా ఉంటామని సీతక్క తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *