మోదీజీ.. మా ‘విజ‌న్‌’ను ప‌రిశీలించండి

– తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు రండి
– ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌ ఆహ్వానం
‘- విజన్‌’లోని అభివృద్ధి పనులకు సహకరించాలని విన్నపాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌ భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌- 2047 గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. పార్లమెంటులో ప్రధానితో బుధ‌వారం జరిగిన ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్‌ సమ్మిట్‌ ఆహ్వాన పత్రికను సీఎం ప్రధానికి అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యాలకనుగుణంగా 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతోందని వివరించారు. దీనికనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించినట్లు చెప్పారు. నీతి అయోగ్‌ సలహాలు, సూచనలతోపాటు అన్ని రంగాల నిపుణుల మేధో మథనంతో తయారు చేసిన ఈ విజన్‌ డాక్యుమెంట్‌ను గ్లోబల్‌ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్నట్లు సీఎం ప్రధానికి తెలిపారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌లో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయసహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు తగిన అనుమతులు ఇవ్వాలని కోరారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసింది. రూ.43,848 వేల కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌గా చేపట్టేందుకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగానికి కేబినేట్‌ ఆమోదంతోపాటు ఫైనాన్సియల్‌ అప్రూవల్‌ ఇవ్వాలని, దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు వెంట ప్రతిపాదనల్లో ఉన్న రీజనల్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టును వీలైనంత తొందరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ నుంచి అమరావతి మీదుగా బందర్‌ పోర్టు వరకు 12 లేన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, హైదరాబాద్‌ నుంచి బెంగుళూరు హైస్పీడ్‌ కారిడార్‌ను అభివృద్ధికి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని విజ్క్షప్తి చేశారు. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్‌ రిజర్వ్‌ మీదుగా మన్ననూర్‌ నుంచి శ్రీశైలం వరకు ఫోర్‌ లేన్‌ ఎలివేటేడ్‌ కారిడార్‌ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని సీఎం ప్రధానికి వినతిపత్రం అందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *