అత్యంత పేదరికానికి చెక్

– సమగ్ర జీవనోపాధి కార్యక్రమం మరో 7 మండలాలకు విస్తరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: సమగ్ర జీవనోపాధి కార్యక్రమం (టీజీఐఎల్‌పీ)ను మరో ఏడు మండలాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో అత్యంత పేదరిక నిర్మూలన దిశగా కీలక అడుగుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని ఆగాఖాన్ ఫౌండేషన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు, అత్యంత వెనుకబడిన ఆదివాసీ గిరిజన వర్గాలు (పీవీటీజీఎస్) ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ జీవనోపాధి కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, పినపాక, దుమ్ముగూడెం, చర్ల మండలాలు, మహబూబాబాద్ జిల్లా గంగారం, ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్రంలో గుర్తించిన పీవీటీజీలలో గోండ్, కొలం, తోటీ, చెంచు సముదాయాలు ఉన్నాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) ఆధ్వర్యంలో అమలు చేస్తూ ఆగా ఖాన్ ఫౌండేషన్, బ్రాక్ ఇంటర్నేషనల్ సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘గ్రాడ్యుయేషన్ అప్రోచ’ విధానాన్ని అనుసరిస్తూ స్థానిక వనరులు, సామాజిక అవసరాలకనుగుణంగా జీవనోపాధి అవకాశాలను సృష్టిస్తుందని మంత్రి వివరించారు. సామాజిక రక్షణ, ఆర్థిక చేయూత, నైపుణ్యాభివృద్ధి, మార్కెట్ అనుసంధానం వంటి అంశాలను సమగ్రంగా కలిపి అమలు చేస్తామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్ప పువ్వు ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఇటీవల జరిగిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఈ ఉత్పత్తులకు విశేష ఆదరణ లభించిందని మంత్రి తెలిపారు. స్థానిక వనరులను మార్కెట్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఆదివాసి గిరిజన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా ఐదు జిల్లాల్లో ఎనిమిది మండలాల్లో సుమారు 6,000 అత్యంత పేద కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు 3,554 కుటుంబాలు లబ్ధి పొందాయని తెలిపారు. త్వరలోనే మరో 8,000 కుటుంబాలను సమవేశి ఆజీవిక యోజన (సే) ద్వారా జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్‌ఎం) కింద ఆర్థిక సహాయం అందజేసి ఆదాయ వృద్ధి కార్యక్రమాలకు అనుసంధానిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కేరళ రాష్ట్రం అత్యంత పేదరిక నిర్మూలనలో సాధించిన విజయాలను ఆదర్శంగా తీసుకుని, రాష్ట్రంలో కూడా సమగ్ర డేటా ఆధారిత, సమయపాలనతో కూడిన కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రతి అత్యంత పేద కుటుంబాన్ని గుర్తించి ఆహారం, నివాసం, ఆరోగ్యం, విద్య, జీవనోపాధి వంటి అన్ని రంగాల్లో సమగ్ర మద్దతు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మాజీ అదనపు కార్యదర్శి చరణ్జీత్ సింగ్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ మోనిక భుటుంగురు, బ్రాక్ ఇంటర్నేషనల్ ఇండియా హెడ్ శ్వేతా ఎస్ బెనర్జీ తదితరులు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *