6న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ‌ప్రారంభం

వ‌ర్చువ‌ల్ గా ప్రారంభించ‌నున్న‌ప్ర‌ధాని మోదీ

‌చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. జనవరి 6వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. రూ.413 కోట్లతో ఏర్పాటు చేసిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను గతేడాది డిసెంబర్‌ 28 ‌ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌  ‌మృతి చెందడంతో కార్యక్రమం వాయిదా పడింది. మాజీ ప్రధాని మృతి కారణంగా వారం రోజులపాటు కేంద్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. ఈ మేరకు కార్యక్రమం వాయిదా పడింది. అయితే తాజాగా జనవరి 6వ తేదీన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, ‌కిషన్‌ ‌రెడ్డి నేరుగా పాల్గొననుండ‌గా.. ప్రధాని మోదీ మాత్రం వర్చువల్‌గా హాజరై రైల్వే టెర్మినల్‌ను ప్రారంభిస్తారు. అయితే రెండు నెలల్లో మొత్తం నాలుగుసార్లు టెర్మినల్‌ ‌ప్రారంభోత్సవం వాయిదా పడడం రైల్వే వర్గాలను తీవ్రంగా నిరాశపరిచింది.

మరో కొత్త తేదీ ప్రకటించడంతో ఈసారైనా ఎలాంటి అవాంతరాలు లేకుండా కార్యక్రమం జరగాలని రైల్వే అధికారులు, తెలంగాణ వాసులు కోరుకుంటున్నారు. జనవరి 6న చర్లపల్లి టెర్మినల్‌ ‌ప్రారంభమైతే సుమారు 50 వేల మంది ప్రయాణికులకు మోక్షం లభిస్తుంది. గంటల తరబడి ట్రాఫిక్‌ ‌సమస్య నుంచి వారికి విముక్తి కలుగుతుంది. చర్లపల్లి వద్ద ప్రస్తుతం 26 రైళ్లు ఆగుతుండగా.. ఈ టెర్మినల్‌ అం‌దుబాటులోకి వస్తే ప్రతి రోజూ 50 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. దీంతో వేగంగా గమ్య స్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. రైల్వే అధికారులు ప్రస్తుతం ఇక్కడ 2 ఎంఎంటీఎస్‌ ‌ప్లాట్‌ఫాంలతో కలిపి మ్నెత్తం 9 ప్లాట్‌ఫాంలు, 6 ఎస్కలేటర్లు, 2 ఫుట్‌ఓవర్‌ ‌బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికుల కోసం ఉచిత వైఫై సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికలు రచించారు. వెయిటింగ్‌ ఏసీ, నాన్‌ ఏసీ హాల్స్, ‌ఫుడ్‌ ‌కోర్టులు, రెస్టారెంట్లు, రిజర్వేషన్‌ ‌కౌంటర్లు, టికెట్‌ ‌కౌంటర్లు వంటివి సైతం సిద్ధం చేశారు. ఇది ప్రారంభమైతే హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌, ‌కాచిగూడ రైల్వేస్టేషన్లపై ప్రయాణికుల భారం తగ్గనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *