అస్తవ్యస్తమైన జనజీవనం

– హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన
– వరదల బారిన అనేక ప్రాంతాలు
– మరో మూడు రోజులు ఇదే పరిస్థితి
– పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం
– నాలుగు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబరు19: హైదరాబాద్‌లో కుండపోత వాన పడుతోంది. హయత్‌ ‌నగర్‌ ఎల్బీ నగర్‌ ‌ప్రాంతాల్లో పడుతున్న వానకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏకదాటిగా అరగంట నుంచి జోరు వాన దంచి కొడుతోంది.  హైదరాబాద్‌లో కుండపోత వర్షాలతో నగరంలోని అనేక ప్రాంతాలు వరదల బారినుండి తట్టుకోలేకపోయాయి. బల్కంపేట అండర్‌పాస్‌లో వరద నీటిలో చిక్కుకుని ఒకరు మృతి చెందగా, హబీబ్‌ ‌నగర్‌లో మామా అల్లుళ్లు వరదనీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. ముషీరాబాద్‌లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వర్షాల కారణంగా నగరంలో ట్రాఫిక్‌ ‌జామ్‌లు ఏర్పడి జనజీవనం స్తంభించిపోయింది. మురుగు కాలువలు నిండి ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఈ వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వరద నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌లు వస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌ ‌మండలం గూడూరు వద్ద చిన్నేటి వాగులో వరద ఉప్పొంగి ప్రవహిస్తున్న సంఘటనలో ఒక యువకుడు కొట్టుకుపోయాడు. భారీ వర్షాల కారణంగా వాగులో వరద పెరిగి, లెవెల్‌ ‌బ్రిడ్జి పైకి నీరు చేరింది. ఈ బ్రిడ్జిని దాటుతున్న సమయంలో యువకుడు వరద నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన తీవ్రమైన ప్రమాదాన్ని హెచ్చరిస్తుంది. వాగుల ద్వారా ప్రయాణించే ముందు వాటి నీటిమట్టం గురించి జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు. యువకుడిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టడం జరుగుతోంది.
కాగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడ్రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్‌? ‌వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ నిజామాబాద్‌, ‌సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌ ‌జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, ‌కరీంనగర్‌, ‌రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మెదక్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌ఖమ్మం, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. హైదరాబాద్‌? ‌వాతావరణ కేంద్రం నిజామాబాద్‌, ‌సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్‌ ‌కర్నూల్‌ ఈ ‌నాలుగు జిల్లాలకూ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ అక్టోబర్‌ ‌మొదటి వారంలో ఉంటుందని తెలిపింది. ఇటీవల హైదరాబాద్‌? ‌మహానగరంలో ఆకస్మికంగా మేఘాలు గర్జిస్తుండటంతో కుండపోత వానలు పెరిగాయి. రహదారులు కాలువలుగా, కాలనీలు చెరువుల మాదిరి తలపిస్తున్నాయి. లోతట్టులో ఉన్న ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఆదివారం దురదృష్టవశాత్తు ముగ్గురు వ్యక్తులు నాలాల్లో గల్లంతయ్యారు. ఎవరైనా గల్లంతైయిన 24 గంటల అనంతరం మృతి చెందినట్లుగా అధికారికంగా ధ్రువీకరిస్తున్నారు.  తక్కువ టైంలో ఎక్కువ వర్షం కురవడం ఒక సమస్య అయితే నాలాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం మరో కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నగరంలోని నివాసాల్లో వరద ఇంకడం లాంటి ఏర్పాట్లు ఎక్కడా లేవు. ఇళ్లపై కురిసిన వర్షపు నీరు నేరుగా రోడ్ల మీదకే వస్తోంది. మొత్తం కలిసి ఏరులై ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు అవసరాలకు సరిపడా వరద కాలువల నిర్మాణాలు లేవు. ఉన్నవాటిలో పూడిక తీయకపోవడం వల్ల ఆక్రమణలు పెరిగిపోవడంతో అవి చిన్నగా మారిపోయాయి. వరద సంభవించినప్పుడు దాని తీవ్రత తగ్గించడానికి ఏర్పాటు చేసిన భూగర్భ ట్యాంకులు సైతం నామమాత్రంగా మారాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *