– వందేమాతరం గీతాలాపన.. నిలబడని ఎంఐఎం సభ్యులు
– బీజేపీ అభ్యంతరం.. తీవ్ర వాదోపవాదాలు
– ప్లకార్డులతో బీఆర్‌ఎస్, దున్నపోతుకు వినతితో బీజేపీ నిరసనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాలాపన సమయంలో మజ్లిస్ కార్పొరేటర్లు సీట్లలో నుంచి లేవకపోవడంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) కౌన్సిల్ సమావేశంలో మంగళవారం తీవ్ర గందరగోళం నెలకొంది. వందేమాతర గీతం పాడితేనే దేశంలో ఉండాలంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో బీజేపీకి వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఇరు పార్టీల కార్పొరేటర్లు బల్లలు ఎక్కి హంగామా చేశారు. దాంతో మార్షల్స్ రంగంలోకి దిగి వారిని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆ రెండు పార్టీల కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేశారు. మరో రెండున్నర నెలల్లో ప్రస్తుత పాలక వర్గం గడువు ముగియనుండగా ఈ రోజు జరుగుతున్నది చివరి సమావేశం. ఈ సమావేశంలో 95 ప్రశ్నలు, 45 అజెండా అంశాలపై చర్చించాల్సి ఉంది. సమావేశానికి జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతోపాటు నగరంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ క్రమంలో కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందే రభస మొదలైంది. పారిశ్రామికవాడల భూములను అమ్మేలా రూపొందించిన పాలసీని రద్దు చేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేస్తూ జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. రూ.5 లక్షల కోట్ల విలువైన 9,292 ఎకరాల భూములను అమ్మేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ దేశంలోనే అతిపెద్ద స్కామ్‌కు తెరలేపిందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఇండస్ట్రియల్ కారిడార్ భూములను అమ్ముతున్న పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాగా, కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాకముందే ప్రాంగణంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్, బీజేపీలు రెండిరటికీ చెందిన కార్పొరేటర్లు వివిధ అంశాలపై నిరసనలు తెలియజేయడానికి సిద్ధమయ్యారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకుని కౌన్సిల్ హాల్‌లోకి ప్రవేశించారు, మార్షల్స్ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే తలసాని జోక్యం చేసుకుని మార్షల్స్‌ను హాల్ నుండి బయటకు వెళ్లమని సూచించే వరకు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అంతకుముందు సమావేశానికి హాజరయ్యే ముందు తమ ఫిర్యాదులను నమోదు చేస్తూ ఒక దున్నపోతుకు వినతిపత్రాన్ని సమర్పించడం ద్వారా బీజేపీ కార్పొరేటర్లు వినూత్నంగా నిరసన తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




