రాజకీయ రిజర్వేషన్లలో మార్పులు అవసరం!

‘సుప్రీమ్‌’ ‌తీర్పును  ఆమోదించడం శుభపరిణామం..
రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు రావాలన్ననినాదం ఎత్తుకోవాలి

రాజకీయాల్లో కూడా మాదిగలకు రిజర్వేషన్లు దక్కాలని తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో  తీసుకున్న నిర్ణయం చారిత్రక నిర్ణయంగానే చూడాలి. ఇది  దేశానికి, ఇతర రాష్ట్రాలను  ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కేవలం ఉద్యోగాల్లో మాత్రమే గాకుండా ప్రథమంగా రాజకీయ రిజర్వేషన్లు దక్కాలి. అది కూడా ఎల్లకాలం ఒకే కుటుంబానికి ఎస్సీ రిజర్వేషన్లు దక్కరాదు. అంతేగాకుండా ఒకే కుటుంబం రిజర్వేషన్లు తన్నుకుపోవడం కూడా సరికాదు. నిజానికి నిజమైన ఉద్యమం ఇక్కడే మొదలు కావాలి. మందకృష్ణ వీలయితే రాజకీయ ఉద్యమం మొదలు పెట్టాలి. రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు రావాలన్న నినాదం ఎత్తుకోవాలి. తెలంగాణలో తీసుకుంటే కాకాగా పేరున్న వెంకటస్వామి కుటుంబమే మూడు రాజకీయ పదవులు పొందింది.

ఇదో రకంగా రిజర్వేషన్లను అపహాస్యంచేయడమే. ఇది ఒక్క  ఎస్సీల్లోనే కాదు..అన్ని స్థానాల్లో కుటుంబానికి ఒక్కటే సీటు అన్న నినాదం రావాలి.  నినాదం కాస్తా రాజ్యాంగ నిర్ణయం కావాలి. కేంద్రంలోసోనియా కుటుంబంలో మూడు పదవులు అంటే ముగ్గురు ఎంపిలుగా ఉన్నారు. తెలంగాణలోనే కెసిఆర్‌ ‌కుటుంబంలో  నలుగురైదుగురు, చంద్రబాబు కుటుంబంలో నలుగురైదుగురు ఉంటున్నారు. ఓవైసీ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల్లో ఇద్దరికిద్దరు జీవితాంతం ఎంపిగా, ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఇలాంటి వాటిపై ఆంక్షలు ఉండాలి. ఒకే కుటుంబ మూలాలు ఉన్న వారికి ఒక్కటే సీటు అన్న రాజ్యాంగ నిర్ణయం రావాలి. ఒక్కరు రెండు పర్యాయాలకు మించి రాజకీయ పదువులు పొందకుండా చూడాలి. ఎస్సీవర్గీకరణ నేపథ్యంలో ప్రజలంతా ఇలాంటి పోరాటాలు చేయాలి. వేల ఏళ్లుగా  షెడ్యూల్డ్ ‌కులాలు అట్టడుగు స్థాయిలో ఉంటున్నారు. వీరంతా వేల సంవత్సరాలనుంచి సామాజిక హక్కులు దక్కకుండా అస్పృశ్యత, అంటరాని తనాన్ని అనుభవించారు.వారికి రాజకీయంగా కూడా పదవులు గట్టిగా దక్కడం లేదు.

దక్కినా బిచ్చం మాదిరిగా వేస్తున్నారు. రిజర్వేషన్లు ఉండబట్టి వీరంతా అక్కడక్కడా కొంత ప్రాతినిధ్యం పొందుతున్నారు. రాజ్యాంగంలో15 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అయితే ఈ రిజర్వేషన్లు కూడా కొందరికే దక్కుతు న్నాయి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కారణంగా కొంత మెరుగు పడవొ చ్చు. మాదిగ ఉపకులాల్లో మరీ అధ్వాన్నంగా ఉన్న వారెందరో ఉన్నారు. షెడ్యూల్డ్ ‌కులాల్లో (ఎస్‌సి)59 ఉపకులాలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా ఉన్న కులాలు మాదిగ, మాలలు. ఇందులోనూ మాలలే ఎక్కువ శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. జనాభాపరంగా అత్యధికంగా ఉన్నప్పటికీ సామాజికంగా బాగా వెనుకబడ్డ కులం మాదిగ వర్గం మాత్రమే. మాదిగ కులంలోనూ ఇంకా అట్టడుగు స్థాయికి చెందిన డక్కలి వంటి వారు ఉన్నారు. మెజారిటీ జనాభా గల మాదిగ కులానికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లలో తగిన వాటా దక్కకపోవడమే కారణంగానే మందకృష్ణ ఉద్యమించాల్సి వచ్చింది.

కానీ రాజకీయాలు పెత్తందార్లు, ఉన్నత వర్గాల చేతుల్లో ఉన్న కారణంగా మాదిగల రిజర్వేషన్‌ ‌పోరాటం మూడు దశాబ్దాలుగా కొనసాగింది. వీరి మధ్య అసమానతల నేపథ్యంలో మాల, మాదిగల మధ్య వైరుద్యం పెరిగింది.  అందుకే తమజాతికి న్యాయం జరగాలన్న పట్టుదలతో మంద కృష్ణమాదిగ నేతృత్వంలో 1994న మాదిగ రిజర్వేషన్‌ ‌పోరాట సమితి ఏర్పడింది.  దీని ఆధ్వర్యంలో ఎస్‌సి రిజర్వేషన్‌ ‌వర్గీకరణ ఉద్యమం మొదల్కెంది. దీంతో అనాటి ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1996లో వర్గీకరణ అంశంపై జస్టిస్‌ ‌పి.రామచంద్ర రాజు కమిషన్‌ ‌నియమించారు. ఈ కమిషన్‌ ‌షెడ్యూల్డ్ ‌కులాల్ని వెనకబాటుతనం ఆధారంగా ఎ, బి, సి, డిలుగా వర్గీకరణ చేయాలనీ సిఫార్సు చేసింది. ఎస్‌సి రిజర్వేషన్‌ ‌వర్గీకరణను విద్య, ఉద్యోగాల్లో వర్తింప చేయాలని సూచించింది. ఈ కమిషన్‌ ‌నివేదిక మేరకు 2000 నుంచి అమలు పరిచారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సి ఉప వర్గీకరణను సుప్రీంకోర్టులో సవాల్‌ ‌చేయడంతో 2004లో కొట్టివేశారు. దీంతో మాదిగ ఉప కులాలు నిరసన వ్యక్తం చేసి, వర్గీకరణ చట్టబద్ధతకై కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం 2007లో ఉషా మెహ్ర కమిషన్‌ను నియమించినది. ఈ కమిషన్‌ ‌కూడా రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమని నొక్కి చెప్పింది. కానీ ప్రభుత్వాలు ఓట్ల రాజకీయం కోసం ఇన్నాళ్లు దాటవేశారు. అయినా చివరకు పోరాటానికి గుర్తింపు దక్కింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో వాస్తవాలు గుర్తించి వర్గీకరణకు ఆమోదం ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పులో ఎస్‌సి కులాల్లో ఎక్కువ, తక్కువలున్నాయని దేశం గుర్తించింది. సామాజిక, ఆర్థిక స్థితిగతుల గణాంకాలు సేకరించి, వాటి ఆధారంగా ఉపవర్గీకరణ చేయాలనీ స్పష్టం చేసింది.

మాదిగలు కన్నా తక్కువ సంఖ్యా బలం ఉన్న మాలల ఇంతకాలం రిజర్వేషన్‌లను అనుభవించారు. ఎస్‌సి వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును అధ్యయనం చేసిన తెలంగాణ ప్రభుత్వం , తీర్పును అమలు చేసేందుకు అసెంబ్లీ వేదికగా చర్చించి ఆమోదించడం శుభపరిణామం. ఈ క్రమంలో వీరికి రాజకీయంగా కూడా రిజర్వేషన్లు దక్కాల్సి ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్టాల్రు తెలంగాణను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాల్సి ఉంది. కేంద్రం కూడా రాజకీయ రిజర్వేషన్లలో వీరి వాటాను గుర్తించి రాజ్యాంగ సవరణలు చేస్తే మరీమంచిది. పనిలో పనిగా రాజకీయ రిజర్వేషన్లలో మార్పులు తీసుకుని రావాల్సిన ఆగత్యం గుర్తించాలి. ఎస్‌సి రిజర్వేషన్‌ ‌వర్గీకరణతోనే దళితుల్లో సామాజిక న్యాయం సాధ్యం కాదు. దీన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలి. అన్ని రంగాలలో వీరిని ముందుకు తీసుకువెళ్లాలి.  జనాభా దామాషా, వెనుకబాటు ఆధారంగా జరుగుతున్న ఈ ఎస్‌సి వర్గీకరణను రాజకీయాల్లో కూడా దక్కినప్పుడే సంపూర్ణంగా న్యాయం చేకూరగలదు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన ఎస్‌సి వర్గీకరణను విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో కూడా వీరికి ప్రాధాన్యం దక్కేలా చేయాలి. ప్రభుత్వ పథకాలలో,కార్పొరేషన్‌ ‌లోన్లలో కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.
-కందుల శ్రీనివాస్‌
(‌సీనియర్‌ ‌జర్నలిస్ట్)
9848443599

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *