– అక్రిడిటేషన్‌ల మంజూరులో నిబంధనలు మార్చాలి
– డబ్ల్యూజేఐ వినతికి మంత్రి పొంగులేటి సానుకూల స్పందన
ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 6 : ఖమ్మం జిల్లా కేంద్రంలో అధునాతన ప్రెస్ క్లబ్ నిర్మించుకుందామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మంలోని తన నివాసంలో మంత్రి పొంగులేటిని శుక్రవారం కలిసిన వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్, కో కన్వీనర్లు యెన్నబోయిన శ్రీనివాస రావు, అమరనేని రామకృష్ణ, ఖమ్మం అసెoబ్లీ నియోజక వర్గ కన్వీనర్ కె.కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు బొడ్డుపల్లి రవీందర్ తదితరులు జర్నలిస్టులకు సంబంధించిన పలు అంశాలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో అధునాతన ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలని, జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో డబ్ల్యూజేఐ ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని, అక్రిడిటేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన కొన్ని నిబంధనలను మార్చాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఖమ్మంలో అధునాతన ‘ప్రెస్ క్లబ్ నిర్మించుకుందామన్నారు. ఇప్పుడున్న ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదని, అక్కడ కనీసం పార్కింగ్ స్థలం కూడా లేదని, ఎక్కువమంది కూర్చోవడానికి ఇబ్బందిగా వుందని డబ్ల్యూజేఐ ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. కొత్త ప్రెస్ క్లబ్ నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించి, అధునాతన భవనం నిర్మించాలని కోరారు. అలాగే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ స్థలాలను కేటాయించి ప్రెస్ క్లబ్ భవన నిర్మాణాలను చేపట్టాలని, వీటి నిర్మాణాలు పూర్తి అయ్యే వరకూ తాత్కాలికంగా నియోజక వర్గాల్లో నిరుపయోగంగా వున్న ప్రభుత్వ భవనాలను కేటాయించాలని కోరారు. అవకాశం వున్నచోట ఇందిరమ్మ మోడల్ హౌస్ లను ప్రెస్ క్లబ్బుల నిర్వహణకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ది తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2025లో కొన్ని అంశాలు జిల్లాల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు కార్డులు పొందడంలో ఇబ్బందిగా మారాయని డబ్ల్యూజేఐ ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఆయా పత్రికల్లో పని చేస్తున్న ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఏ మాత్రం సరిపోనందున ప్రతి కేటగిరీలో కార్డులు పెంచాలని, జిల్లా కేంద్రాల్లో పనిచేసే క్రైమ్, స్పొర్ట్స్, కల్చరల్, ఎడ్యుకేషన్ జర్నలిస్టులకు కూడా రాష్ట్రస్థాయిలో ఇచ్చినట్లు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, డెస్క్, వెబ్ సైట్, ఫ్రీలాన్స్, కేబుల్ టీవీ జర్నలిస్టులందరికీ కార్డులు మంజూరు చేయాలని డబ్ల్యూజేఐ మంత్రికి విజ్ఞప్తి చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




