‘చంద్రసాగర్‌-అమ్రాబాద్‌’ను వెంటనే చేపట్టాలి

– ఈనెల 30 వరకు కరపత్రాలతో ముమ్మర ప్రచారం
– పాలమూరు అధ్యాయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ హరగోపాల్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, సమగ్ర వికాసం కోసం ఒక ప్రత్యేక పథకంగా చంద్రసాగర్‌-అమ్రాబాద్‌ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టాలని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈనెల 30 వరకు నిర్వహించే ప్రాజెక్టు విశిష్టతను తెలిపే ప్రచార కరపత్రాన్ని వేదిక ప్రతినిధులు రాజేంద్ర బాబు పి.బిస్వామి, ఆర్‌.సుధీర్‌, రఘుపతిరావు, ఎ.మల్లయ్య లతో ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆవిష్కరించి మాట్లాడారు. డిరడి ప్రాజెక్టు నిర్మించి వందేళ్లు కావస్తున్నా చిన్నపాటి లిఫ్ట్‌ ఏర్పరిచి నీటి వసతి కల్పించాలని పాలకులకు ఆలోచన రాలేదన్నారు. ఆదివాసీలైన చెంచులు, లంబాడా గిరిజనులు, దళితులు ఇతర వెనుకబడిన ప్రజలందరికీ వ్యవసాయమే జీవనాధారం అని, సాగునీటి సమస్య తీరితే అప్పర్‌ ప్లాట్‌ ప్రజలు నమ్మకంగా సేద్యం చేసుకుంటారని తెలిపారు. అందులో భాగంగానే ఈ కరపత్ర ప్రచారం చేపట్టినట్లు తెలిపారు. యావత్‌ తెలంగాణ సమాజం దీనికోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా అప్పర్‌ ప్లాట్‌ దిగువ రైతాంగానికి, అప్పర్‌ ప్లాట్‌ రైతాంగానికి మధ్య వివాదాలు తలెత్తకుండా చంద్రసాగర్‌ రిజర్వాయర్‌ ఆధారంగా నీరు లిఫ్ట్‌ చేసి భూములకు నీటి వసతి కల్పించాలన్నారు. భూగర్భ జలాలు లోతులకు వెళ్లిపోయి చిలుము నీరు మాత్రమే దొరుకుతున్న అప్పర్‌ ప్లాట్‌ ప్రజల తాగు, సాగునీటి సమస్య పరిష్కరించాలని అన్నారు. ఈ సమస్య సౌర గిరిజల వికాస పథకంతో తీరదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *