-మారుతున్న కాలానికనుగుణంగా మారాలి
– చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తి గొప్పది
– రజకుల సమస్యలపై సమీక్షా సమావేశం
– మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకల సందర్భంగా రవీంద్రభారతిలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇనగుర్తి మధు రాసి పాడిన పాటను, చాకలి ఐలమ్మ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. సామాజికంగా చాకలి ఐలమ్మ ఉద్యమ పోరాట స్ఫూర్తి గొప్పదని, భూమి కోసం ముక్తి కోసం నిరంకుశ పాలనపై పోరాడిన ధీర వనితగా వర్ణించారు. సామాజిక న్యాయం కోసం మహిళలకు గౌరవం భంగం కలిగితే తిరుగుబాటు చేసిన వనితగా పేర్కొన్నారు. 130 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వం తరుపున ఆమె జయంతికి నివాళులర్పించుకుంటున్నామంటే ఆమె ఎంతటి గొప్ప పోరాట యోధురాలో అర్థం చేసుకోవచ్చన్నారు. కులవృత్తులు నామోషి కాదని, మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తులు మారాలి.. అప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందుతామన్నారు. రజకుల సమస్యల పై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశామన్నారు. 119 నియోజకవర్గాల్లో ఎలక్ట్రిక్ డ్రైకింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. 250 యూనిట్ల ఉచిత విద్యుత్ నిరంతరం సరఫరా జరగాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. మూడు రోజుల్లో 102 జీవో అమలు అయ్యే విధంగా ఆదేశాలు ఇస్తామన్నారు. నేడో రేపో రిజర్వేషన్లపై జీవో వస్తుంది.. ఎన్నికలకు 42% రిజర్వేషన్లతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత ప్రభుత్వం ది.. కాపాడుకునే బాధ్యత మీది. స్థానిక సంస్థల ఎన్నికల్లో, ప్రభుత్వం పరిధిలో జరిగే ఎన్నికల్లో ఎవరు జోక్యం చేసుకోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు ,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్,ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, బీసీ జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ కమీషనర్ బాల మాయాదేవి,ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





