చైన్‌ స్నాచర్‌ ఆటకట్టు

– సాంకేతికతతో పట్టుకున్న వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు
– నిందితుడి నుంచి రూ.23.50 లక్షల సొత్తు స్వాధీనం

వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: చైన్‌ స్నాచింగ్‌లతోపాటు ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని కెేయూసీ, సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. అతడినుండి రూ.23.50 లక్షల విలువ గల 237 గ్రాముల బంగారు పుస్తెలు, గొలుసులు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.10 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ వివరాలను వెల్లడిరచారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర ప్రాంతానికి చెందిన మంతుర్తి హరీష్‌(29) ప్రస్తుతం హన్మకొండ రెడ్డి కాలనీలో అద్దె ఇంట్లో వుంటున్నాడు. డిగ్రీ వరకు చదువుకుని హైదరాబాద్‌లోని ఓ సిమెంట్‌ కంపెనీలో క్వాలిటీ టెక్నీషియన్‌గా పనిచేశాడు. సహోద్యోగి ఇంట్లో గొలుసు చోరీకి పాల్పడి దానిని స్థానిక మణిప్పురం గోల్డ్‌ లోన్‌ కంపెనీలో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో నిందితుడు జల్సాలు చేశాడు. నేరేడ్‌మెట్‌ పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలైనా అతనిలో మార్పు రాలేదు. తన జల్సాలకు అవసరమైన డబ్బు కోసం నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేద్దామనుకున్నాడు. అందుకు ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి దానిపై తిరుగుతూ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం పది చైన్‌ స్నాచింగ్‌లు, మూడు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో కేయూసీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు, రాయపర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు, సుబేదారి, కాజీపేట, హసన్‌పర్తి, కమలాపూర్‌, కరీంనగర్‌ జిల్లాలోని చిగురుమామిడి పీఎస్‌ల పరిధిలో ఒకటి చొప్పున చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. హన్మకొండ, హసన్‌పర్తి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిందితుడు మూడు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడ్డాడు. వరుస చైన్‌ స్నాచింగ్‌లపై అప్రమత్తమైన పోలీసులు క్రైమ్స్‌, హన్మకొండ ఏసీపీల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత ఆధారంగా నిందితుడిని గుర్తించి పక్కా సమచారంతో మంగళవారం ఉదయం యాదవ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద కేయూసీ, సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో నిందితుడు తాను చోరీ చేసిన బంగారు గొలుసులను విక్రయించేందుకు చోరీ చేసిన ద్విచక్ర వాహనంపై వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. అతడిని పట్టుకొని తనిఖీ చేయగా బంగారు గొలుసును గుర్తించారు. పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా నేరాలను అంగీకరించాడు. అతని ఇంటి నుండి మిగతా చోరీ సొత్తును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడుని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన క్రైమ్స్‌ డీసీపీ గుణశేఖర్‌, క్రైమ్స్‌ ఏసీపీ సదయ్య, హన్మకొండ ఏసీపీ నర్సింహారావు, కెేయూసీ సీసీఎస్‌ సీఐలు రవికుమార్‌, రాఘవేందర్‌, ఏఏఓ సల్మాన్‌ పాషా, సీసీఎస్‌ ఎస్‌ఐలు రాజ్‌కుమార్‌, శివకుమార్‌, హెడ్‌ కానిస్టేబుళ్ళు అంజయ్య, జంపయ్య, కానిస్టేబుళ్ళు మధుకర్‌, చంద్రశేఖర్‌, రాములు, నగేష్‌లతో కేయూసీ పీఎస్‌ సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *