రాష్ట్రంలో ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌

– ఆస్ట్రేలియా డీకిన్‌ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏర్పాటు
– ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఎల్‌వోఐపై సంతకాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘ఏఐ’ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ డీకిన్‌ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌(ఎల్‌వోఐ)పై సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఇయాన్‌ మార్టిన్‌, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్‌ మిశ్రాలు సోమవారం సంతకాలు చేశారు. ఏఐలో నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఈ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు డీకిన్‌ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఇది కేవలం లాంఛనప్రాయ ఒప్పందం కాదని, రాబోయే రోజుల్లో కీలక రంగాల్లో తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు దిక్సూచీగా మారుతుందని వివరించారు. సమాజానికి ఉపయోగపడే అత్యాధునిక ఏఐ పరిష్కారాల అభివృద్ధితోపాటు పరిశోధనలు, వ్యవస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని వివరించారు. ఏఐ కోర్సుల రూపకల్పన, శిక్షణ, స్టార్టప్‌లకు చేయూత, ఏఐ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ రంగాల్లో ప్రపంచానికి అత్యంత నైపుణ్యమున్న మానవ వనరులను తెలంగాణ నుంచే అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ సెంటర్‌, యంగ్‌ ఇండియన్‌ స్కిల్‌ యూనివర్సిటీ సంయుక్తంగా నేటి మార్కెట్‌ అవసరాలకనుగుణంగా ఏఐ కోర్సులకు రూపకల్పన చేసి, ఇక్కడి యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణనిస్తాయని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గవర్నెన్స్‌ తదితర రంగాల్లో ఏఐ వినియోగాన్ని పెంచి పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించేలా సంయుక్త పరిశోధనలు నిర్వహిస్తామన్నారు. డీకిన్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఇయాన్‌ మార్టిన్‌ మాట్లాడుతూ ఏఐలో తెలంగాణను గ్లోబల్‌ లీడర్‌గా తీర్చిదిద్దేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన ఏఐ పరిష్కారాలను అందించాలనే లక్ష్యంతోనే భారత్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కాన్సూల్‌ జనరల్‌(ఆస్ట్రేలియన్‌ కాన్సూలేట్‌- జనరల్‌ బెంగళూరు) స్టీవెన్‌, కాన్సూల్‌ ఆండ్రూ కాలిస్టర్‌, ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ కమిషనర్‌ వికా సింగ్‌, పొలిటిల్‌ అండ్‌ ఎకానమిక్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌ రంజని మాధవన్‌, డికన్‌ యూనివర్సిటీ ప్రతినిధులు రౌనీత్‌ పాహ్వా, ప్రియాంక సింగ్‌, గాయత్రి వేద్‌నారాయణన్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *