– నేతృత్వం వహించనున్న కేంద్ర జల వనరుల సంఘం చైర్మన్
న్యూదిల్లీ, జనవరి 2ః తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాద పరిష్కారానికి సంబంధించిన కమిటీని ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం.. సహకార సమాఖ్య విధానంతో గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకమైన వేదికలను ఏర్పాటు చేసి సమన్వయంతో సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తోంది. కృష్ణానది జల వివాద పరిష్కారానికి 6 అక్టోబర్ 2023న కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ను నిర్దేశించింది. రెండేళ్ల కాల వ్యవధి 1 ఆగస్టు, 2025 నాడు ముగియగా కృష్ణా జలాల వినియోగంపై వాదనలు నడుస్తున్నందున దీన్ని మరో ఏడాది (31 జూలై, 2026) పొడిగించింది. ఏపీ పునర్విభజన చట్టంలోని చాప్టర్ 9, సెక్షన్ 84 ప్రకారం కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించిన విషయంలో సమస్యల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. 16, జూలై 2025 నాడు దిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ (జల్‌శక్తి) మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో తెలంగాణ, ఏనీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న కౌన్సిల్ సమావేశంలో ఇరు రాష్ట్రాల జల వివాదాలను చర్చించి సాంకేతికతంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 23, 2025న తెలంగాణ ప్రభుత్వం ప్రతినిధులను నామినేట్ చేయడంతో శుక్రవారం కేంద్ర జలవనరుల సంఘం కొత్త కమిటీని నోటిఫై చేసింది. ఈ కమిటీకి కేంద్ర జల వనరుల సంఘం చైర్మన్ నేతృత్వం వహించనున్నారు. కమిటీలో తెలంగాణ నుంచి జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ, ఇంజనీర్-ఇన్-చీఫ్ సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు కృష్ణానది యాజమాన్య బోర్డు, హైదరాబాద్ చైర్మన్, గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్, నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యుడీఏ) చీఫ్ ఇంజనీర్, సీడబ్ల్యుసీ చీఫ్ ఇంజనీర్ కూడా సభ్యులుగా ఉంటారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే