– ఎలాంటి ట్రైల్స్ లేకుండా దేశంలోకి విత్తనాలు వచ్చే ప్రమాదం
– విత్తనాల విషయంలో రాష్ట్రాలకు పాత్ర లేకపోవడమేంటి?
– అన్ని వర్గాలతో చర్చించి ముందుకెళ్లాలి
– నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయే అవకాశం
– రైతే కేంద్రంగా విత్తన బిల్లు రూపొందించాలి
-కేంద్ర ప్రభుత్వ ముసాయిదాపై కేటీఆర్ ఫీడ్‌బ్యాక్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న విత్తన బిల్లును కేంద్రం వెంటనే ఆపివేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ కోరారు. విత్తన బిల్లు డ్రాఫ్ట్‌ను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. ఈ బిల్లు డ్రాఫ్ట్‌పై పార్టీ తరఫున గురువారం ఆయన సుదీర్ఘమైన ఫీడ్‌బ్యాక్ అందించారు. ఎలాంటి ట్రయల్స్ లేకుండా విదేశీ విత్తనాలు దేశంలోకి వచ్చే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. రైతే కేంద్రంగా, రైతు ప్రయోజనాలే పునాదిగా నూతన విత్తన బిల్లు ఉండాలని స్పష్టం చేశారు. విత్తనాల అంశంలో రాష్ట్రాల పాత్ర లేకుండా చేస్తున్న ఈ బిల్లును అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. రైతు సంఘాలతోపాటు విత్తన నిపుణులు, వ్యవసాయ రంగ నిపుణులు, రాజకీయ పార్టీలతో కూలంకషమైన చర్చ తర్వాతనే ఈ బిల్లుపై ముందుకు పోవాలని కేంద్రానికి సూచించారు. ఈ విత్తన బిల్లు వలన రైతన్నలకు తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు. అందుకే రైతన్నలతో, రైతు సంఘాలతో, నిపుణులతో, రాజకీయ పార్టీలతో చర్చించిన అనంతరం ఈ బిల్లుఅంశంపై ముందుకు పోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బిల్లులో నకిలీ విత్తనాలను కట్టడి చేసే అంశంపై స్పష్టత లేదని, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతన్నలకు నిర్దిష్ట సమయంలోనే నష్టపరిహారం అందించే అంశంపై గ్యారంటీ లేదన్నారు. దీంతోపాటు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా విత్తనాల ధరలను నిర్ణయించే విధంగా నిబంధనలున్నాయని, గతంలా విత్తనాల ధరల నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకుండా పోతుందన్నారు. నకిలీ విత్తనాల తయారీలో కంపెనీలను బాధ్యులను చేయకుండా కేవలం అమ్మకదారులను బాధ్యత వహించేలా, కేవలం సప్లై చైన్‌పై నకిలీ విత్తనాల బాధ్యతను ఉంచేలా ఈ చట్టాన్ని రూపొందించారన్నారు. నకిలీ విత్తనాలకు సంబంధించిన అంశంలో జాతీయ స్థాయిలో ఆయా కంపెనీలను బ్లాక్ లిస్ట్ చేయడం, భారీ పెనాల్టీలు, కఠిన జైలు శిక్ష వంటి అంశాలకు ఇందులో పెద్దగా ఆస్కారం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. దీంతోపాటు రైతన్నలే విత్తనాలను తయారు చేసుకొని పండించుకునే వ్యవసాయ సాంప్రదాయాలు ఇప్పటికీ అనేక చోట్ల ఉన్నాయని,ఇలాంటి రైతన్నల సమూహానికి ఈ బిల్లులో ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటితోపాటు విదేశాల నుంచి నేరుగా ఆయా కంపెనీలు ఎలాంటి విత్తన ట్రయల్స్ లేకుండానే దేశంలో తమ విత్తనాలను అమ్ముకునే విధంగా సులభమైన నిబంధనలు ఉన్నాయని, వీటి వలన దేశీయ విత్తన భద్రత, విత్తన సార్వభౌమత్వం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి రాష్ట్రాలకు, రాష్ట్రంలోని వ్యవసాయ యూనివర్సిటీలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేశారన్నారు. ఈ మొత్తం బిల్లు రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయ రంగంలో కీలకమైన విత్తనాల అంశంపై కేంద్ర ఆధిపత్యానికి దారితీస్తుందని, స్థానిక పరిస్థితులకనుగుణంగా రాష్ట్రాలు సొంత చట్టాలు చేసుకుని ముందుకు పోయే అంశాన్ని బలహీనం చేస్తుందని కేటీఆర్ అన్నారు. అందుకే రైతే కేంద్రంగా ఉండే విత్తన బిల్లుకు రూపకల్పన చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, ఈ అంశంలో ఈజ్ ఆఫ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు ఆధిపత్యం అప్పగించే ప్రయత్నాలను పక్కన పెట్టాలని తమ పార్టీ తరఫున ప్రతిపాదించిన సవరణల్లో పేర్కొన్నారు. దీంతోపాటు విత్తన సార్వభౌమత్వం, దేశీయ బయోసేఫ్టీ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్రాల అంశంపై కేంద్రానికి ఆధిపత్యం ఇవ్వకుండా రూపకల్పన చేయాలని ఈ బిల్లుకు సవరణలు ప్రతిపాదించారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతన్నలకు ఎకరానికి పండే పంటలో గరిష్ఠ ఉత్పత్తి మేరకు నష్టపరిహారం నిర్దిష్ట సమయంలో అందే కఠిన నిబంధనలు ఇందులో ఉంచాలని సూచించారు. కేంద్రం కంపెనీల ప్రయోజనాల కోసంకాక రైతన్నల ప్రయోజనాలకు, వ్యవసాయ సంక్షేమ అభివృద్ధికి ఉపయోగపడేలా అత్యంత పారదర్శకంగా, కఠినమైన నిబంధనలతో కూడిన విత్తన బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఉందని కేటీఆర్ సూచించారు. త్వరలోనే ఈ అంశంపై వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితోపాటు ఎంపీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ తరఫున ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్రానికి మరిన్ని సూచనలు ఇస్తామని తెలియజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





