కులగణన కూడా చేపట్టనున్న కేంద్రం
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 16: జనగణనకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. పదిహేనేళ్ల తర్వాత నోటిఫికేషన్ జారీతో జనగణన ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్టయింది. మొత్తం రెండు దశల్లో జనగణన చేపడతారు. 2027 మార్చి 1వ తేదీనాటికి జనగణన ప్రక్రియ పూర్తవుతుంది. మంచు ఎక్కువగా వుండే జమ్ము-కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ల్లో 2026 అక్టోబర్ 1 అర్థరాత్రివరకు, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో 2027, మార్చి 1వ తేదీనాటికి జనగణన పూర్తిచేయనున్నట్టు హోంమంత్రిత్వశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. స్వాతంత్య్రానంతరం చేపడుతున్న 16వ జనగణన కావడం విశేషం. ఈ జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టడం ఈసారి ప్రత్యేకత. ఇందుకోసం 34లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, 1.34లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. ఈసారి జనగణన ట్యాబ్‌లు, డిజిటల్ రూపంలోనే కొనసాగనుంది. ప్రభుత్వం పేర్కొనే పోర్టళ్లు, యాప్‌ల్లో ప్రజలు సొంతంగా తమ వివరాలు నమోదుచేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. డేటా భద్రతకోసం కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు హోమంత్రిత్వశాఖ తెలిపింది. సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజీ అత్యంత కట్టుదిట్టంగా చేపట్టనున్నట్టు తెలిపింది. ఇప్పటికే జనాభా లెక్కలకోసం 30 ప్రశ్నలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
జనగణన ప్రధానంగా రెండు దశల్లో చేపట్టనున్నారు. మొదటిదశలో గృహజాబితా, గృహగణన వుంటుంది. ఇందులో జనాభాకు అందుబాటులో వున్న సౌకర్యాలతో పాటు, శాశ్వత లేదా తాత్కాలిక గృహాల డేటాను సేకరిస్తారు. ఈదశ సమగ్ర చిరునామా రిజిస్టర్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెండోదశలో వ్యక్తుల సమాచారం సేకరిస్తారు. అంటే పేరు, వయస్సు, లింగం, మతం, కులం, విద్య, వృత్తి, వలస, మొదలైనవి నమోదు చేస్తారు. జనగణన కోసం 16భాషల్లో మొబైల్ యాప్‌లను వినియోగించనున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలతో సహా అన్ని కుల సమూహాలను కవర్ చేసేవిధంగా ఈ కులగణన వుండనుంది. ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ పథకాలు, నియోజకవర్గాల పునర్విభజన, వ్యాపార ప్రణాళికలకు ఈ జనగణన ఎంతగానో ఉపయోగపడనుంది. గత జనగణన 2011లో జరిగింది. షెడ్యూలు ప్రకారం2020లో జనగణన ప్రక్రియ ప్రారంభించాల్సి వున్నప్పటికీ కోవిడ్ మహమ్మారికారణంగా ఈ ప్రక్రియ వాయిదాపడిరది. అయితే దేశవ్యాప్తంగా కులగణన జరపాలంటూ డిమాండ్లు పెరగడం, బిహార్, తెలంగాణ వంటి రాష్ట్రాలు కులగణను పూర్తిచేసిన నేపథ్యంలో కేంద్రం జనగణనతో పాటే కులగణన కూడా నిర్వహించాలని నిర్ణయించింది.




