నైనీ బ్లాక్ టెండ‌ర్లు పిలిచి వెన‌క్కి త‌గ్గ‌డ‌మేంటి?

– అవినీతి అక్ర‌మాల వార్త‌లు దుర‌దృష్ట‌క‌రం
– సైట్ విజిట్ స‌ర్టిఫికెట్ నిబంధ‌న దుర్వినియోగం
– సింగ‌రేణికి రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.47వేల కోట్ల బ‌కాయిలు
– ఏ బొగ్గు గ‌ని సంస్థ‌కూ ఇంత‌టి ఇబ్బందులు లేవు
– సింగ‌రేణిని రాష్ట్ర ప్ర‌భుత్వాలు దోచుకున్నాయి
– కేంద్రం త‌ర‌పున పూర్తిగా స‌హ‌క‌రిస్తా
– మంత్రి కిష‌న్‌రెడ్డి

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 21:  రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు నైని కోల్ బ్లాక్ ను కేటాయించింద‌ని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైని కోల్ బ్లాక్ విషయంలో టెండర్లను ఆహ్వానించి చివరి నిమిషంలో వెనక్కు తగ్గారని కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి జి.కిష‌న్‌రెడ్డి తెలిపారు. ఇవాళ కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా అదే పద్ధతిలో టెండర్లను ఆహ్వానించి వెనక్కు తగ్గిందన్నారు. దిల్లీలో మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ నైని కోల్ బ్లాక్ కు సంబంధించి ఒడిశా సీఎం , కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ తో మాట్లాడి అనుమతులు వచ్చేలా చొరవ తీసుకున్నానని, అనేక రివ్యూ మీటింగ్స్ లో స్వయంగా మాట్లాడానని చెప్పారు. ఈ ప్రయత్నాల కారణంగా సహకార సమాఖ్య స్ఫూర్తితో 643 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి అప్పగించేందుకు ఆమోద ముద్ర వేస్తూ 2024 జూలై 4న  ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద నైని బ్లాక్ కు తుది అనుమతులు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనులను ప్రారంభించాల్సిందిపోయి పారదర్శకమైన పద్ధతిలో పనులు చేపట్టక ఆలస్యం చేసింద‌ని ఆరోపించారు. అనేక అక్రమాలు, అవినీతి జరిగినట్లు వార్తలు రావడం దురదృష్టకరమ‌న్నారు.

సైట్ విజిట్ సర్టిఫికేట్’.. అది సెల్ఫ్ డిక్లరేషన్

బొగ్గు రవాణాకు సంబంధించి టెండర్లో ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ నిబంధనను సింగరేణి యాజమాన్యం.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చేర్చిందన్నారు. అనేకచోట్ల ఈ నిబంధన ఉంది. కానీ అది సెల్ఫ్ డిక్లరేషన్.. దీనికి ఒక కారణం ఉంది. సైట్ విజిట్ చేసిన తర్వాతే సదరు కాంట్రాక్టర్ కు మినరల్ నిల్వలపై, అక్కడి భౌగోళిక స్థితిపై ఓ స్పష్టమైన అవగాహన వస్తుందనేది ఆ నిబంధనకు అర్థం. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తప్పనిసరి నిబంధనగా మార్చి అవినీతికి బాటలు వేసింద‌ని విమ‌ర్శించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలాచోట్ల టెండర్ల ప్రక్రియలో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారన్నారు. పారదర్శంగా పనిచేస్తున్నాం. కానీ.. సింగరేణిలో సైట్ విజిట్ నిబంధనను తప్పనిసరి చేసి బొగ్గు వెలికి తీసే ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని కిష‌న్‌రెడ్డి ఆరోపించారు. కోల్ బ్లాక్ కు సంబంధించి సీబీఐ దర్యాప్తు జరపాలి, కేంద్ర మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. కానీ కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది. నాడు కేంద్రానికి 49% భాగస్వామ్యం ఉన్న విషయాలు మరిచిపోయారా? కొన్ని సంస్థలకు, కొందరు వ్యక్తులకు లాభం చేసేలా వ్యవహరించిన మాట వాస్తవం కాదా?  తాడిచర్ల కోల్ బ్లాక్ ను జెన్కోకు కేటాయించాం. దీని మైనింగ్ చేసేందుకు సింగరేణి ముందుకొస్తే వారితో ‘మేం పనిచేయలేమని లేఖ రాయించుకుని’ ప్రైవేటు కంపెనీకి 25 ఏళ్ల టెండర్ కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? ఆయ‌న‌ ప్ర‌శ్నించారు. ఇవాళ సుమారు రూ.47వేల కోట్లను సింగరేణికి రాష్ట్రం బకాయి పడింద‌ని గుర్తుచేశారు. దేశంలో ఏ కోల్ మైనింగ్ కంపెనీ కూడా ఈ స్థాయిలో ఇబ్బందుల్లేవన్నారు. బ్యాంకులనుంచి డబ్బులు తెచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. సింగరేణిలో జి11 గ్రేడ్ బొగ్గు  అమ్మకం ధర టన్నుకు రూ.4,088. ఇదే కోలిండియాలో రూ.1,605. దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి మీద పడి దోచుకుంటున్నాయి కాబట్టే సంస్థను నడిపేందుకు వారి వద్ద ధరలను పెంచడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదన్నారు. సింగరేణి కోల్ కొంటున్న జెన్కో కూడా ప్రభుత్వ సంస్థనే కాబట్టి సింగరేణి ధరలు పెంచుకుంటూ పోతోంది. సింగరేణి బొగ్గు క్వాలిటీ 58% ఉండగా కోలిండియాలో బొగ్గు క్వాలిటీ 86%. సింగరేణి అస్తిత్వానికే ప్రమాదం ఏర్ప‌డింద‌ని కిష‌న్‌రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎన్టీపీసీ,ఏపీ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం కూడా సింగరేణి బొగ్గు మాకు వద్దని అంటున్నాయి. అవినీతి, అక్రమాల కారణంగా సింగరేణి భవిష్యత్తు అంధకారంలో పడే పరిస్థితి నెలకొంది. సింగరేణి భూములు గతంలో బీఆర్ఎస్.. నేడు కాంగ్రెస్ పార్టీ అనేక జిల్లాలు, మండల కేంద్రాల్లో ఆక్రమణలకు గురవుతున్నాయి. అనేక పత్రికలు, చానళ్లలో సింగరేణి అక్రమాలపై చాలా కథనాలు వచ్చాయి. దీనిపై బోర్డు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు లేవనెత్తిన అంశాలపైనా చర్చించడం లేదు. సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే కేంద్రం దీన్ని పరిశీలిస్తుంద‌న్నారు. సింగరేణి కార్మికుల భవిష్యత్తును రక్షించుకునేందుకు వ్యవస్థను పక్షాళన చేయాల్సిన అవసరం ఉంద‌ని అన్నారు. మంత్రుల మధ్య వాటాల పంపిణీతోనే ఈ వివాదాలు బయటకొచ్చాయ‌న్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఎలా చెల్లిస్తారు? వివిధ దశల్లో చెల్లిస్తారా? ఒకేసారి ఇస్తారా అని ప్రశ్నిస్తున్నాను. ఇవాళ.. సింగరేణి ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెట్టి ఈ అంశాలన్నీ చర్చించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు చర్చించారు. ఇది రాజకీయ పార్టీలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం మాత్రమేకాదు. ఇది సింగరేణి భవిష్యత్తుకు, దీనిపై ఆధారపడిన కుటుంబాలకు సంబంధించిన విషయం. సంస్థకు సంబంధించిన అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. దీనిపై కోల్ సెక్రటరీ విదేశీ పర్యటన పూర్తిచేసుకుని వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి లేఖ రాస్తారు. కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారానికి సిద్ధంగా ఉన్నాను. టెండర్ల ప్రక్రియ విషయంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నాం. త్రైపాక్షిక ఒప్పందం జరగాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో జరిగే టెండర్లు, ఇతర ప్రక్రియపై విస్తృతంగా చర్చిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి సింగరేణిని లాభాల బాటలో నడిపేందుకు మాకు అప్పగిస్తే ఆ బాధ్యతను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని కిష‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *