కులగణన పేర బీసీ జనాభాను తగ్గించే యత్నం

– ఎంఐఎంకు లబ్ది చేకూరేలా రిజర్వేషన్లు
– బిసిని ప్రధానిని చేసిన ఘనత బిజెపిది

– కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

న్యూ దిల్లీ, జులై 25: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీతో వారిని కాంగ్రెస్‌ మోసం చేయాలని చూస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు బీసీ-ఈ పేరుతో 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, ఇప్పుడు ముస్లింలకు 4 నుంచి 10 శాతానికి పెంచి బీసీలకు అన్యాయం జరిగేలా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తోందని అన్నారు. కులగణన పేరుతో బీసీలను తగ్గించే యత్నం చేసిందన్నారు. 56 శాతం బీసీలని చెబుతూ వారిలో ముస్లింలను 10 శాతం చూపిందని, నిజమైన బీసీలు 46 శాతం మాత్రమే ఉన్నారంటూ వారిని మోసం చేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఎవరికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటోందో కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చేతివృత్తులపై ఆధారపడి పనిచేసే కులాలకు మాత్రమే రిజర్వేషన్లు అందించారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లలో ముస్లిం వర్గాలు కూడా లబ్ధి పొందే అవకాశం ఉందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లతో కలిపి ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధంగా 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట కుట్ర పన్నిన విషయం తెలిసిందేనన్నారు. 150 డివిజన్లు ఉంటే 50 సీట్లు బీసీలకు రిజర్వ్‌ చేశారు. ఆ సీట్లలో బీసీయేతరులైన మజ్లిస్‌ పార్టీకి చెందిన వారే గెలిచారు. ఇప్పుడు 42శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట మళ్లీ ముస్లింలకే లబ్ధి చేకూర్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. బీసీలను ఏదో ఉద్ధరించామన్నట్టు దిల్లీలో రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ భుజాలు చరుచుకుంటున్నారు. గతంలో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 32 శాతానికి తగ్గిస్తున్నారని, అసదుద్దీన్‌ ఒవైసీ పార్టీకి లబ్ధి చేకూర్చడమే తప్ప బీసీలకు ఒనగూరే ప్రయోజనమే లేదని అన్నారు. ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ బీసీ జనగణనకు అంగీకరించలేదన్నారు. మేం చేసే కుల గణన రాజ్యంగబద్ధం చేసి భవిష్యత్తులో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఒక్క బీసీ వ్యక్తిని కూడా సీఎంను చేయలేదని, ఒక్క బీసీ వ్యక్తి కూడా ప్రధానిని చేసిన పాపానపోలేదని ఎద్దేవా చేశారు. తమ కేంద్ర మంత్రివర్గంలో అనేకమంది బీసీలను బీజేపీ నియమించింది.. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇచ్చింది బీజేపీనే.. అత్యధికమంది ఎంపీలను బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచే గెలిపించుకున్నాం అని వివరించారు. 1972లో లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చారు.. అంటే వారు కూడా కన్వర్టెడ్‌ ఎస్టీలా? 1994లో గుజరాత్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మండల్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం మోదీ కులాన్ని బీసీ జాబితాలో చేర్చిందని, అప్పుడు మోదీ కనీసం ఎమ్మెల్యేగా కూడా లేరని కిషన్‌రెడ్డి చెప్పారు. కేంద్రంలో అప్పుడున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. అదే సమయంలో విశ్వ బ్రాహ్మణులతోపాటు మరికొన్ని కులాలను కూడా బీసీల్లో చేర్చారు. మరి వారిని కూడా కన్వర్టెడ్‌ బీసీలంటారా అని ప్రశ్నించారు. ఆ తర్వాత కూడా చాలా కులాలను ఎస్సీ, ఎస్టీల జాబితాలో చేర్చారన్నారు. వరుసగా మూడోసారి కూడా రాహుల్‌ గాంధీని దేశ ప్రజలు తిరస్కరించి నరేంద్ర మోదీని ప్రధానిని చేయడంతో ఫ్రస్టేషన్‌తోనేó రేవంత్‌ రెడ్డితో ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారని విమర్శించారు. మీ రాహుల్‌ గాంధీ ఏ సామాజికవర్గానికి చెందిన వ్యక్తో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నానన్నారు. దేశ ప్రధానమంత్రిపై దిగజారిన వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం పెంచిన రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని, 42 శాతం రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే అందేలా చూడాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోందన్నారు. వేరే వారికి నీతులు చెప్పే ముందు రేవంత్‌ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రిని చేయాలి అని కిషన్‌రెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *