– గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి బాట
– బడ్జెట్‌లో పీఆర్, ఆర్డీకి పెద్ద పీట
– బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి సీతక్క సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం, గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధుల పాత్రను బలపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై మంత్రి సీతక్క సచివాలయంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ వినియోగం, వచ్చే ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు. విభాగాల వారీగా అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలు మంత్రికి సమర్పించగా వాటిలో మార్పులు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను పూర్తిస్థాయిలో సాధించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా కేంద్ర నిధులు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటాను తప్పకుండా సాధించాలని అన్నారు. కేంద్రానికి రాష్ట్రం భారీగా పన్నులు చెల్లిస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమర్థంగా సాధించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేస్తే అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలిపారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, యుటిలిటీ సర్టిఫికెట్లు సమర్పించి వాటిని త్వరగా విడుదల చేయించాలని సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన వీబీజీ రాంజీ చట్టానికి సంబంధించి ఇంకా నిబంధనలు తయారు కాలేదన్న మంత్రి సీతక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శాఖలోని అన్ని విభాగాలు తమ ప్రగతి నివేదికలను క్రమం తప్పకుండా రూపొందించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. జల సంరక్షణ కార్యక్రమాల్లో రాష్ట్రానికి ఉత్తమ రాష్ట్రంగా అవార్డులు వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, అదే విధంగా అన్ని విభాగాలు మెరుగైన పనితీరు కనబరచాలన్నారు.
నంబర్ వన్ స్థానంలో నిలవాలి
99 రోజుల ప్రణాళికలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నంబర్ వన్ స్థానంలో నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. జిల్లాలవారీగా నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2 నాటికి ఈ భవనాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదని, మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌పై కూడా సమీక్ష నిర్వహించారు. ఆదివాసీ, ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో అనేక వాగులున్నప్పటికీ వేసవిలో సాగు, తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి అన్నారు. వర్షాకాలంలో వరదలు, వేసవిలో నీటి ఎద్దడి సమస్యలు ఎదురవుతున్నందున వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా వాగులు, వంకలు, తోగులపై చెక్‌డ్యాంల నిర్మించాలని ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, ఉపాధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధనే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, శాఖకు చెందిన అన్ని విభాగాల హెచ్‌వోడీలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




