– నిధుల్లో కోత ఫెడరలిజంపై దాడే
– మేమిచ్చాం, తెచ్చాం అంటున్నారు.. అది రాష్ట్ర ప్రజల సొమ్ము
– కేంద్రానికి తెలంగాణ ఇచ్చేది రూ.1,33,208 కోట్లు
– కేంద్రం తిరిగి ఇచ్చింది రూ.51 వేల కోట్లు మాత్రమే
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: దేశానికి అధికంగా ఆదాయం సమకూరుస్తున్న దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ఆర్థిక విధానాల వల్ల అన్యాయానికి గురవుతున్నాయని, ఇది కేవలం ఆర్థిక వివక్షే కాదు రాజకీయ ఉద్దేశంతో కూడిన వివక్ష అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. వికసిత్ భారత్ అనే నినాదం ఇస్తూ దేశ అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల ముఖ్యంగా తెలంగాణ విషయంలో స్పష్టమైన వివక్ష, నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తోందన్నారు. 2018-19 నుంచి 2022-23 వరకు ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన మొత్తం పన్నులు రూ.90.80 లక్షల కోట్లు అయితే ఇందులో దక్షిణాది రాష్ట్రాల నుండే పావు భాగానికి పైగా రూ.22.86 లక్షల కోట్లు వచ్చాయన్నారు. అలాంటి దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం తిరిగి ఇచ్చిన నిధులు 16.3 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఇది ఆర్థిక సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం అని మంత్రి వ్యాఖ్యానించారు. పన్నులు చెల్లించిన ప్రతి రూపాయికి తిరిగి వచ్చే నిధులను పోల్చితే కేంద్రం పాటిస్తున్న ద్వంద్వ వైఖరి బయటపడుతోందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు రూపాయికి సగటున 30 పైసలు ఇస్తూ బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలకు రూ.1కి రూ.4 చొప్పున ఇస్తున్నదని, ఇది ఆర్థిక అసమతుల్యతను పెంచడమే కాÅ£ ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభేదాలను సృష్టించే ప్రమాదకర ధోరణి అని హెచ్చరించారు. ఎక్కువ పన్నులు చెల్లించే రాష్ట్రాలను శిక్షించడం, తక్కువ వసూళ్లు చేసే రాష్ట్రాలను ప్రోత్సహించడం కేంద్ర విధానంగా మారిందని మంత్రి ఆరోపించారు. కేంద్రం చెప్పుకునే వికసిత్ భారత్ విధానం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
తెలంగాణ గణాంకాలే సాక్ష్యం
డిసెంబర్‌లో జరిగిన పార్లమెంట్ సమావేశాలలో అడిగిన ప్రశ్నకు 2024-25లో తెలంగాణ నుండి రూ.1,33,208 కోట్ల పన్నులు వసూలైతే కేంద్రం నుండి రాష్ట్రానికి కేంద్ర పన్నుల రూపంలో రూ.27,050 కోట్లు, గ్రాంట్ల రూపంలో రూ.7,913 కోట్లు, కేంద్ర ప్రాయోజిత£ పథకాల రూపంలో రూ.16,762 కోట్లు మొత్తంగా రూ.51,725 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర మంత్రి సమాధానం చెప్పారని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. పథకాల రూపంలో వచ్చిన నిధులను కూడా కలిపితేనే ఈ మొత్తం వస్తోందని, స్వేచ్ఛగా వినియోగించుకునే నిధులు మాత్రం మరింత తక్కువ అని చెప్పారు.
జీఎస్టీతో మొదలైన దెబ్బ గ్రాంట్ల కోతతో కొనసాగింపు
జీఎస్టీ సవరణల కారణంగా రాష్ట్రం ఇప్పటికే ఏడాదికి సుమారు రూ.8 వేల కోట్లు నష్టపోతోందని మంత్రి తెలిపారు. ఇక 15వ ఆర్థిక సంఘం సూచించిన రెవెన్యూ లోటు గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం పూర్తిగా పక్కన పెట్టడంతో రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్య్రం దెబ్బతిన్నదని విమర్శించారు. రంగాలవారీగా రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లకు కత్తెర పెట్టడం వల్ల తెలంగాణకు మరో రూ.5 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఇది కేవలం లెక్కల విషయం కాదు. ఇది కేంద్రంలో ఉన్న పాలకుల రాజకీయ ఆలోచనల ఫలితం. బలమైన రాష్ట్రాలను బలహీనపరచి ఆర్థికంగా ఆధారపడేలా చేయాలనే ఉద్దేశమే కనిపిస్తోందని తుమ్మల విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ అస్థిత్వాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ముఖ్యంగా తాము అధికారంలో లేని రాష్ట్రాలకు తక్కువ నిధులు విడుదల చేసి వారి కుచిత స్వభావాన్ని చూపెడుతున్నారన్నారు.
ఫెడరల్ వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉంది
ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు భాగస్వాములే కాని కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడేవి కావని మంత్రి స్పష్టం చేశారు. దేశం సమగ్రాభివృద్ధి సాధించాలన్నా, కేంద్రం చెప్పుకుంటున్న వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలన్నా అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని, ముఖ్యంగా ఆదాయం సమకూర్చే రాష్ట్రాలపై వివక్ష మానుకోవాలని కేంద్రాన్ని మంత్రి కోరారు. రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించే బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పదేళ్లలో ఏనాడూ ప్రశ్నించకపోగా రాష్ట్రానికి అన్ని తెచ్చాం, ఇన్ని చేశాం, రాష్ట్ర ఖజానాకు కేంద్రమే పూర్తి నిధులు సమకూరుస్తున్నదన్నట్లు మాట్లాడటం తగదన్నారు. జాతీయ రహదారుల నిర్మాణాలను కూడా రాష్ట్రానికి విడుదల చేసే నిధుల ఖాతాలలో వేస్తున్న ఈ నాయకులు ప్రజల నుండే టోల్ చార్జీల రూపంలో మళ్లీ వసూలు చేస్తున్న విషయాన్ని మరిచారా అని మంత్రి ప్రశ్నించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రుణ మాఫీ, రైతు భరోసా, పంట కొనుగోళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో భారీగా ఖర్చు చేస్తోందని, కానీ కేంద్రం నుంచి రావాల్సిన న్యాయమైన వాటా రాకపోవడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని అన్నారు. ప్రభుత్వం ఈ యూనియన్ బడ్జెట్‌లో చేర్చాల్సిందిగా చేసిన ప్రతిపాదనలలో ఒక్కటి కూడా మంజూరు చేయలేదని, ఇప్పటికైనా తెలంగాణను రాజకీయంగా శిక్షించే బడ్జెట్‌లు మానుకుని ఫెడరలిజాన్ని గౌరవించి తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలని, లేకపోతే వికసిత్ భారత్ ఒక నినాదంగానే మిగిలిపోతుందని, నిజమైన అభివృద్ధి సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నాయకులు కూడా తెలంగాణకు రావాల్సిన న్యాయబద్దమైన వాటా కోసం కేంద్రంతో పోరాడటానికి తమతో కలిసి రావాలని మంత్రి తుమ్మల కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





