కేంద్రం జోక్యం చేసుకోవాలి

– గ్యాస్ కొరతపై పెట్రోలియం మంత్రికి కేటీఆర్ లేఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: వాణిజ్య, గృహ అవసరాల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల తీవ్ర కొరతపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు (కేటీఆర్) కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన తీవ్ర అంతరాయం వల్ల హోటళ్లు, తినుబండారాల కేంద్రాలు, పీజీ హాస్టళ్లు, చిన్నచిన్న ఆహార వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని తన లేఖలో పేర్కొన్నారు. వెంటనే సరఫరా పునరుద్ధరించకపోతే వేలాది వ్యాపార సంస్థలు మూతపడే ప్రమాదం ఉందని, లక్షలాదిమంది కార్మికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులను రక్షించే విధంగా స్థాయిలవారీ ఎల్పీజీ కేటాయింపు వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు. అలాగే ఎల్పీజీ సిలిండర్ల లభ్యతపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించేలా రియల్ టైమ్ పబ్లిక్ డాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరారు. వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచకుండా తాత్కాలిక ధరల స్థిరీకరణ చేయాలని కూడా కేంద్రాన్ని అభ్యర్థించారు. అదనంగా గృహ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు మళ్లిస్తూ జరుగుతున్న బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాదిమంది విద్యార్థులు, ఉద్యోగులు ఆధారపడే పీజీ హాస్టళ్లకు ప్రత్యేక రక్షణ కేటగిరీ కింద గ్యాస్ సరఫరా చేయాలన్నారు. గ్యాస్ ఆధారిత శ్మశానవాటికల్లో కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండేందుకు వాటిని అత్యవసర సేవలుగా గుర్తించి ప్రాధాన్య కేటాయింపు ఇవ్వాలని కూడా కేటీఆర్ కోరారు. ఈ పరిస్థితి సాధారణ సమస్య కాదని, ఇది లక్షలాదిమంది ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేసే సంక్షోభమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే సమన్వయంతో చర్యలు చేపట్టి ఎల్పీజీ సరఫరాను పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *