– కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో పీ అండ్ ఆర్ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు తాము అనేక ప్రతిపాదనలు పంపామని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కేంద్రాన్ని కోరారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా వ్యవస్థలను స్థిరీకరించడం, దీర్ఘకాలం కొనసాగించేలా నిర్వహించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్‌పై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రజాభవన్ నుంచి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తోందని, నిర్వహణ కోసం కూడా ఏటా రూ.వందల కోట్లT ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నిర్వహణ వ్యయాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావాలని మనవి చేస్తున్నామన్నారు. కేంద్రం అయినా, రాష్ట్రం అయినా తుది లక్ష్యం ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడమే కావాలన్నారు. కలుషిత నీరు సరఫరా అయితే అనేక రకాల వ్యాధులు వ్యాపించి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అందువల్ల ప్రజల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జల్ జీవన్ మిషన్‌ను మరో రెండేళ్లు పొడిగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రాలు అమలు చేస్తున్న తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ ఖర్చులను కూడా కేంద్ర ప్రభుత్వం పంచుకోవాలని తాము మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నూతనంగా ఏర్పాటవుతున్న ఆవాసాలకు తాగు నీరు అందించేందుకు నూతనంగా ప్రాజెక్టులను టేకప్ చేస్తున్నామని, సోర్స్ పాయింట్‌లో డ్రై అయినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. లోకల్ సోర్స్ పాయింట్లను నిర్మిస్తున్నామని, దీనికి సంబంధించి కూడా కేంద్రం తన వంతు సహాయం చేయాలని మంత్రి సీతక్క ప్రతిపాదించారు. సానుకూలంగా స్పందించిన కేంద్రం మంత్రి త్వరలో జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





