– ఒక్క పెద్ద ప్రాజెక్టూ మంజూరు లేదు
– కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు సాధించండి
– కేంద్ర మంత్రులకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ
హుస్నాబాద్, ప్రజాతంత్ర, మే 10: రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్రం దయ కాదు.. తెలంగాణ హక్కు అని, తెలంగాణ ప్రజలు పన్నులు చెల్లిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌పై పార్లమెంటులో జరుగుతున్న చర్చలో తెలంగాణకు సంబంధించిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు చర్చించాలని కోరారు. ఈమేరకు ఆయన వారికి బహిరంగ లేఖ రాశారు. పక్కనున్న ఏపీకి ప్రతి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తున్నా తాము వ్యతిరేకించడం లేదన్నారు. ఆ రాష్ట్రానికి కేటాయిస్తున్న నిధుల్లో సగమైనా కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లను ఇంకా విస్మరించడం తగదదన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య స్ఫూర్తిని, లక్ష్యాన్ని గౌరవిస్తూ రాష్ట్రాలకు పన్నుల వాటాలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్రం తన వాటాను తగ్గించుకుంటూ రాష్ట్రాల మీద భారాలు మోపుతున్నదని పేర్కొన్నారు. ఇది సరికాదంటూ ఈ పథకాల్లో కేంద్ర వాటా 90% ఉండే విధంగా పునరుద్ధరించాలని కోరారు. కిసాన్ సమ్మాన్ నిధి, సామాజిక పెన్షన్లు కేంద్రం నామమాత్రంగా ఇస్తున్నదని, ఆయా మొత్తాలను పెంచాలని పొన్నం కోరారు. పెరిగిన ధరలÅ£నుగుణంగా సవరించాలన్నారు. పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 రూ.24,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని, దీనికి కేంద్రం 50% నిధులు ఇవ్వాలని, మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు, నది శుద్ధి, రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం కేంద్ర సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ 330 కి.మీ భారీ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కొంత అనుమతి వచ్చినా దక్షిణ భాగం ఇంకా పెండింగ్‌లో ఉందని తెలిపారు. హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి కేంద్ర పరిశ్రమల శాఖ నుంచి పూర్తి ఆమోదం అవసరమని, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన బయ్యారం స్టీల్ ప్లాంట్ హామీ ఇప్పటికీ అమలు కాలేదని, కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని తెలిపారు. 2013లో ప్రతిపాదించిన ఐటిఐఆర్ ప్రాజెక్ట్ తెలంగాణకు ప్రకటించాలని, ఇతర రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు తెలంగాకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తెలంగాణలో అనేక రోడ్లను జాతీయ రహదారులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణలో మరో ఎయిమ్స్ స్థాయి మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని, రామప్ప, యాదాద్రి ఆలయాలను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్‌లోనూ తగిన న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా విభజన చట్టం హామీల అమలులో కేంద్రం దారుణంగా విఫలమైందన్నారు. తెలంగాణకు ఐఐఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఊసే లేదన్నారు. ఒక్క ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయడం లేదంటూ తెలంగాణ నుండి బీజేపీకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు.. ప్రజలు ఎనిమిదిమంది ఎంపీలను గెలిపించారు.. అయినా తెలంగాణపై వివక్ష తగదని మంత్రి పొన్నం హితవు పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




