– సీసీఐ ఉన్నతాధికారులతో మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: ఖాయిలా పడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదిలాబాద్ ప్లాంటును పునురుద్ధరించాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ పరిశ్రమను తిరిగి నడిపించాలని సీఎం రేవంత్ రెడ్డి, తాను పలు సందర్బాల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి హెడ్.డి.కుమారస్వామిని కలిసి కోరిన విషయాన్ని గుర్తు చేశారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీసీఐ సీఎండీ సంజయ్ బంగా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో పునరుద్ధరణ ప్రతిపాదనలపై శ్రీధర్ బాబు చర్చించారు. ప్లాంటును ఆధునిక యంత్రాలతో పునరుద్ధరించడానికి రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని సీఎండి చెబుతున్నారని, అది జరిగితే మూడు వేల మందికి ఉపాధి దొరుకుతుందని శ్రీధర్‌బాబు తెలిపారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలోని ఈ భారీ పరిశ్రమను పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వమే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి పలు సందర్బాల్లో కోరారని తెలిపారు. కేంద్రం ప్రతిపాదిస్తున్నట్టు ప్లాంటు ప్రైవేటీకరణను(డిస్ ఇన్వెస్ట్‌మెంటును) తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పునురుద్ధరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సీసీఐ కోరుతోందని, త్వరలోనే దీనిపై తమ అభిప్రాయాలను అందజేస్తామని వెల్లడిరచారు. రెండు వేల ఎకరాల్లో నాణ్యతతో కూడిన సున్నపురాయి గనులు ఉన్నందున ప్లాంటు నిర్వహణ అసాధ్యమేమీ కాదని శ్రీధర్‌బాబు చెప్పారు. సమావేశంలో మైన్స్ అండ్ జియాలజీ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్, గనుల శాఖ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, టీజీఐఐజీ ఎండీ శశాంక తాండూరు, సీసీఐ ప్లాంట్ జీఎం శరద్ కుమార్, సీసీఐ రీజినల్ మేనేజర్ ఉమేశ్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి కూడా సమావేశానికి హాజరై తమ సూచనలు అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



