అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

కొత్త సీడీపీవోలకు మంత్రి సీతక్క సూచన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: మహిళా శిశు సంక్షేమ శాఖ సేవా దృక్పథంతో, మానవతతో పనిచేసే శాఖ అని, సీడీపీవోలు శాఖకు వెన్నెముక లాంటివారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. వేలమంది పోటీ పడితే 23మంది ఉద్యోగాలు సాధించారని, మీరంతా ఎంతో అంకితభావంతో ఉద్యోగాలు సాధించారని, ఇదే అంకితభావంతో మీరంతా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఉన్నత విద్యావంతులైన మీరు తమ శాఖలో చేరటం అభినందనీయమన్నారు. ఆరు సంవత్సరాల వరకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవ చేసే అదృష్టం మీకు దక్కిందని, శిశువులు మహిళల సంరక్షణతోపాటు దత్తత ప్రక్రియ, మహిళా సాధికారత వంటి అంశాలను నిర్వర్తించాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. అంగన్వాడీ లబ్ధిదారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించే బాధ్యత మీదేనంటూ ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సేవలను లబ్ధిదారులకు అందజేయాల్సిన బాధ్యత మీదేనని, ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు అంగన్వాడీలను దేశానికి రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి సీతక్క చెప్పారు. కార్యాలయాలకే పరిమితం కాకుండా ఫీల్డ్‌ విజిట్‌ చేయాలని, అంగన్వాడి సేవల మెరుగుదలకు మీరు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చునన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా పనిచేయాలని సూచించారు.

సీడీపీవోల్లో సంబరం

సీడీపీవోల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో పండగ వాతావరణం నెలకొంది. ప్రజా ప్రభుత్వంలో సకాలంలో ఉద్యోగాల ప్రక్రియ కొనసాగటం వల్లే తమకు ఉద్యోగాలు వచ్చాయని పలువురు సీడీపీవోలు అన్నారు.
తమకు ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు వారు కృతజ్ఞతలు తెలిపారు. తమ పిల్లలు నియామక పత్రాలు అందుకోవడం చూసి వారి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. తమ కూతుళ్లను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనుకున్న తమ కోరిక నెరవేరిందంటూ పదికాలాలపాటు ప్రజా ప్రభుత్వం కొనసాగాలని తల్లిదండ్రులు ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *