1 నుండి పత్తి కొనుగోలుకు సీసీఐ చొరవ చూపాలి

– కేంద్ర జౌళి మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు మంత్రి తుమ్మల లేఖ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: రాష్ట్రంలో సీసీఐ అక్టోబర్‌ 1వ తేదీ నుండి పత్తి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను రాష్ట్ర వ్యవసాయ. జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ ద్వారా కోరారు. రాష్ట్రంలో ఈ సీజన్‌లో 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగయిందని, సుమారు 24.70 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని తెలిపారు. పత్తి సాగు చేసే వారిలో ఎక్కువ శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, వీరి జీవనోపాధి ఎంఎస్పీ కొనుగోళ్లపైనే ఆధారపడి ఉందని వివరించారు. గత వారం సీసీఐ ప్రతినిధులు, జిన్నింగ్‌ మిల్లు అసోషియేషన్‌ ప్రతినిధులు, మార్కెటింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించి పత్తి ఉత్పత్తి, మార్కెట్‌ ధరల పరిస్థితి, ఎంఎస్పీ అమలు, రైతులకు చెల్లింపులు, జిన్నింగ్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ మిల్లుల ఏర్పాట్లు, రవాణా సమస్యలు, డిజిటలైజేషన్‌, రైతుల రిజిస్ట్రేషన్‌, స్థానిక కమిటీలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి అనేక అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు ఆయన తెలిపారు. అయితే ప్రస్తుత సీజన్‌లో సీసీఐ రెండుసార్లు టెండర్లు పిలిచినా కొత్త మార్గదర్శకాలలో ఉన్న నిబంధనల కారణంగా జిన్నింగ్‌ మిల్లర్లు పాల్గొనడం లేదు. దాంతో కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు నష్టపోతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 2024-25లో విజయవంతంగా అమలైన విధానాన్నే కొనసాగించాలని తెలంగాణ కాటన్‌ మిల్లర్స్‌ అండ్‌ ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కోరుతోందని, ముఖ్యంగా ఎల్‌`1, ఎల్‌`2 అలాట్‌మెంట్లు, లింట్‌ రికవరీ శాతం, ఫోర్ట్‌నైట్‌ వారీగా జోన్లవారీ లింట్‌ శాతం నిర్ణయం, రైతుల స్లాట్‌ బుకింగ్‌, ఏరియా మ్యాపింగ్‌ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారని వివరించారు. రైతుల పత్తి కొనుగోళ్లు సక్రమంగా జరిగేందుకు ప్రతి కొనుగోలు కేంద్రంలో స్థానిక మానిటరింగ్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్‌ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కమిటీలు తేమ శాతం, నాణ్యత, తూకం, ధరల విషయంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పర్యవేక్షించాలన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 599 5779, వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌ 88972 81111 కొనసాగుతాయని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రం, జిన్నింగ్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ మిల్లుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, రోజువారీ క్రయవిక్రయాలను పరిశీలించేందుకు డైరెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలన్నారు. గోదాముల నుండి మిల్లులకు పత్తి రవాణాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎంఎస్పీ హామీగా అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని, పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా, పారదర్శకంగా, వేగంగా కొనుగోళ్లు జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. సీసీఐ, మార్కెటింగ్‌ శాఖ, జిల్లా కలెక్టర్లు, రైతు సంఘాలు సమన్వయంతో పనిచేస్తే ఈ సీజన్‌ విజయవంతమవుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పత్తి ధర క్వింటాల్‌కు మార్కెట్‌లో రూ.6,700 మాత్రమే ఉందని, ఇది ఎంఎస్పీ అయిన రూ.8,110 కంటే తక్కువగా ఉందని, ఈ పరిస్థితుల్లో రైతులు డిస్ట్రెస్‌ సేల్స్‌కి గురయ్యే ప్రమాదం ఉందని మంత్రి తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *