– ఆ పేరుతో కాళేశ్వరంను ఎండబెట్టే కుతంత్రం
– ఆంధ్రకు జలాల తరలింపునకు బాబు, మోదీలతో కలిసి కుట్ర
– సీబీఐపై పార్టీ నాయకత్వానిదో తీరు.. రేవంత్‌ది మరో తీరు
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: కాళేశ్వరంపై సీబీఐ విచారణ సాకుతో తెలంగాణ అస్తిత్వంపై చంద్రబాబు, మోదీలతో కలిసి రేవంత్ రెడ్డి భారీ కుట్ర పన్నుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ఆరోపించారు. ఆ వంకతో కేవలం కేసీఆర్, బీఆర్‌ఎస్ మీదనే దాడి జరగడం లేదన్న కేటీఆర్.. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి మన గోదావరి జలాలను ఆంధ్రకు తరలించే కుతంత్రాలకు ఆ ముగ్గురూ తెరతీశారని విమర్శించారు. తెలంగాణ గొంతుకగా ఉన్న కేసీఆర్, బీఆర్‌ఎస్‌లను లేకుండా చేసి తెలంగాణపై తిరిగి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మోదీ, చంద్రబాబు ఎజెండా మేరకు బనకచర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించడం అంటే ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టడమే అన్న కేటీఆర్.. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను మోదీ జేబు సంస్థలుగా విమర్శించిన రేవంత్ 48 గంటల్లోనే ఎందుకు మాట మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓవైపు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తుంటే రేవంత్ మాత్రం మోదీ ప్రాపకం కోసం వాటిని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి చేదుగా అనిపించిన సీబీఐ.. రేవంత్‌కు మాత్రం ముద్దొస్తున్నదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కోరగానే అప్పజెప్పడం ఆ రెండు పార్టీల అక్రమ సంబంధానికి సాక్ష్యం అని అన్నారు. గతంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలినప్పుడు, సుంకిశాలలో సైడ్ వాల్ కూలితే, వట్టెం పంప్ హౌస్ కూలిపోయినా, పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయినా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదని కేటీఆర్ గుర్తుచేశారు. అప్పుడు రాని ఎన్‌డీఎస్‌ఏ మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగితే మాత్రం ఆగమేఘాల మీద వచ్చి తలాతోకలోని రిపోర్టు ఇచ్చిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా ప్రధాని మోదీ కాపాడుతున్న సంగతిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పధ్నాలుగేళ్ల ఉద్యమంలో, పదేళ్లు ప్రగతి ప్రస్థానంలో, రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ఏకైక గొంతుకగా నిలుస్తున్న కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీని అణచివేసే కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుందన్నారు. ఏ ఏజెన్సీకి కాళేశ్వరంపై విచారణ అప్పచెప్పినా బీఆర్‌ఎస్ పార్టీ భయపడదన్నారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న ఈ కుట్రలను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. న్యాయస్థానాలపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందన్న కేటీఆర్ అక్కడ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలకైనా, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమే అని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





