కులం రాజకీయ నిచ్చెన మెట్టు!?

 “ఇవాళ తెలంగాణా రాష్ట్రం లో జరుగుతున్న కుల రాజకీయ క్రీడలను పరిశీలన చేద్దాం! బి ఆర్ ఎస్ పార్టీలో కుటుంబ కలహం ముదిరి కల్వకుంట్ల కవిత తాను స్వయంగా వెలమ కులం అయినప్పటికీ బిసి రాగం ఎత్తుకుంది. ఆమె తన ఎజెండా ఎక్కడ హైజాక్ చేస్తుందోనన్న భ్రమలో తీన్మార్ మల్లన్న ఆమె పై ధ్వజం ఎత్తాడు. చివరకు బిసి వాదం ఘర్షణలు, కాల్పుల వరకు వెళ్ళింది.  ఈ ఎపిసోడ్ ఏమైనా బిసిలకు చిన్నమెత్తు లబ్దిచేసేది కాదు? ఇకపోతే,రెడ్డి,కమ్మ కులాల ఆధిపత్యం గత అర్థ శతాబ్దం కాలం గా కొనసాగుతుంది. ఎందరోరెడ్లు,కమ్మలు రాష్ట్రన్ని ఏలినా ఆయా కులాల్లో పేదలు,గర్భ దరిద్రం అనుభవిస్తున్న వారు లేరని చెప్పగలరా? ఏ కులం కార్డు అయినా ఎన్నికల లబ్దికి, ఆ తర్వాత కులకోటా కోసం కొట్లాటకు తప్ప దేనికీ పనికిరావని ఇప్పటికే నిర్థారణ జరిగింది.”

తెలంగాణా లోకాని, మనదేశంలో కానీ, కులం అనేది ఆయా కులాల్లో ఉన్న పేదలకు మేలు చేసేవి కానేకాదు? ఆ పేరుతో రాజకీయ సమీకరణ చాలా దగ్గర మార్గం గా భావించడం వలన కుల పునాది గల రాజకీయాలు ముందుకు వస్తున్నాయి.కుల ఉన్మాదం వెర్రితలలు వేస్తున్నది.. ఒకరకంగా కులం అనేది భారతదేశం లో మధ్యయుగంలో వృత్తిని బట్టి వచ్చిన వర్గీకరణ. ఆయా వృత్తినైపుణ్యాలు కలవారివి ఆయా కులాలుగా ప్రచారంలోకి వచ్చాయి. కాలక్రమంలో అణగారిన వర్గాలుగా మార్చబడ్డారు. ఇప్పటికీ అణగారిన కులాల కుల పటాలలో, చరిత్ర లో అదే అంశం చెప్పబడుతుంది. మౌఖికం నుండి రాతలోకి భాషగా  మారే స్థితిలో ఉన్నవే ఈ జంతుచర్మాలు, తాళ పత్రాల్లో రాసిన,  పుటాలు, గోత్రాల గురించి చెప్పే పటాలు. సనాతనవాదం అనబడే అలియాస్ బ్రాహ్మణ వాదం దీనినే చతుర్వర్ణలకు కులాలను కుదించి చాతుర్వర్ణ వ్యవస్థగా వర్గీకరించి అన్యాయం గా స్థిరీకరించింది. ఈకులం అనే కాన్సెప్టు భారతదేశం లోనే ఎక్కువ గా చూస్తున్నాము. దీన్ని రాజకీయ పెట్టుబడిగా సైతం వాడుకుంటున్నాము. అవకాశవాద రాజకీయ ఊబి ఇప్పుడు కులాలను వెనుక కాకుండా ముందు పెట్టుకొని వస్తూంది.

రాజకీయాల్లో కుల ప్రాతిపదిక భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఉంది. కాంగ్రేస్ కు తొలుత బ్రాహ్మణ వాదం పునాది అయితే! బిజేపి దాని కాన్సెప్ట్ లో సఫలం కాలేక  ఆదునిక కులం రాజేసిన మతాన్ని ఆలంభణ చేసుకుంది. ఇక ప్రాంతీయ పార్టీలు కుల ప్రాతిపదికనే సక్సెస్ అయ్యాయి. ఆంద్రప్రదేశ్ లో కమ్మ కుల ఆధిపత్యం తో తెలుగు దేశం, తెలంగాణా లో వెలమ కుల ప్రాదాన్యత తో బీ ఆర్ ఎస్ , బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రలలో యాదవులు , హర్యానాలోజాట్ లు ఈ కులప్రాతిపదికనే అధికారంలోకి వచ్చారు.కులాన్ని రాజకీయాలు కు వాడుకోవడంలోసరి  కొత్త ట్రెండ్ దేశంలో బియస్పి సృష్టించింది.దేశవ్యాప్తంగా దళితుల సంఖ్య అధికంగా ఉంది కనుక అంబేడ్కర్ ,జగజ్జీవన్ రామ్  బొమ్మలను ముందు పెట్టి ఓ ప్రయత్నం చేశారు. ఓ దశవరకు ఆ సమీకరణం పనిచేసింది.ఉత్తరప్రదేశ్ లో మాయావతి అధికారంలోకి రాగలిగింది.అటు తర్వాత సంకీర్ణ ఎత్తుగడలో బియస్పి కుల రాజకీయాలు బహిర్గతం అవడంతో ఆయా వర్గలే నమ్మలేని స్థితి ఒకటి వచ్చింది. మెజారిటీ కులం, మైనారిటీ కులం ఏదైనా కానివ్వండి..కులంపేరుతో మోదలైన ఉద్యమాలు అన్ని అంతిమంగా రాజకీయ స్వార్థాన్ని ఎంచుకున్నాయి.వాస్తవంగా, సామాజికంగా వెనుక బడిన వర్గాల కోసం పనిచేసిన, అంబేడ్కర్  ,మహాత్మా జ్యోతిరావు పూలే, భాగ్యరెడ్డి వర్మ, పెరియార్ లాంటి అనేకమంది పీడిత వర్గాలు, కులాల గురించి ఆలోచించి వారికి ఏమి అవసరమో ఆ దిశగా విద్య , సామాజిక హోదా కోసం ప్రయత్నాలు చేశారు తప్ప రాజకీయాలు కులాన్ని బాగు చేస్తాయని భావించలేదు. ఆ దిశగా వారెవరూ ప్రయత్నాలు కూడా పెద్దగా చేయలేదు! కులవివక్ష రూపుమాపడానికి సంస్కర్తలు కృషి కొంత తోడ్పడింది తప్ప,కుల రాజకీయం కుల విద్వేషం పెంచిందే తప్ప!ఆయాకులాల అణగారిన వర్గాల కు ఏమాత్రం తోడ్పడలేదు? సంస్కర్తలుగా ప్రజలు గుర్తించిన తర్వాత సంస్కర్తల పేర్లను,బొమ్మలను రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్దికోసం ఉపయోగించుకొన్న వారే..! ఒకరు కాక అనేక పార్టీలు ఈరోజు సంస్కర్తలను రాజకీయ లబ్దికోసం ఉపయోగించుకుంటున్నారు.

    ఇవాళ రాజకీయాల్లో కులాలను రాజకీయ నిచ్చెన మెట్లు గా ఉపయోగించుకునే వారే ప్రదానం గా కుల ద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ధనిక,బీద అంతరాలు దొంతర్లుగా పెరుగు తున్న ఈ సమాజం లోకులం అనే అడ్డుగోడలు అభివృద్ధికి  ఆటంకం గా మారాయి. గతంలో విజ్ఞాన వంతులైన  ప్రజలు ఆయా కులాల తొలితరం కుల వివక్ష గురించి చర్చించి ఆదునిక సమాజంలో కుల ప్రస్తావన,వివక్ష రూపుమాపడానికి మాత్రమే ప్రయత్నం చేస్తే  ప్రస్తుతం ఏ కులానికి ఆ కులం రాజకీయ కొమ్ములు మోలిపించుకొని వ్యక్తిగత స్వార్థానికి  వాడుకుంటున్నారు. కులం ఉనికే సరైనది కాదని భావిస్తుంటే ప్రస్తుతం కులాన్ని లాబియింగ్ కు వాడుతున్నారు.  అగ్రవర్ణ , అణగారిన కులాలు ఏవైనా ఇప్పుడు తనకులం ఐడెంటిటీ పునాదులపై రాజకీయ స్వారీ చేస్తున్నారు. ఇప్పుడు సమాజంలో కులం ఉనికి తులతూగుతుంటే, కుల ఉన్మాదం పెంచి పోషించే దశలో మన నిచ్చెన మెట్ల రాజకీయ వ్యవస్థ ఉంది. వాస్తవంగా కులం వేరు.. కులదురాబిమానం వేరు!! ఇక్కడ రెంటికీ మద్య తేడా లేకుండా చేసేశారు!  ఇప్పుడు వర్ణ వ్యవస్థలో జనం వర్గ వ్యవస్థను వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.

     ఇవాళ తెలంగాణా రాష్ట్రం లో జరుగుతున్న కుల రాజకీయ క్రీడ లను పరిశీలన చేద్దాం! బి ఆర్ ఎస్ పార్టీలో కుటుంబ కలహం ముదిరి కల్వకుంట్ల కవిత తాను స్వయంగా వెలమ కులం అయినప్పటికీ బిసి రాగం ఎత్తుకుంది. ఆమె తన ఎజెండా ఎక్కడ హైజాక్ చేస్తుందోనన్న భ్రమలో తీన్మార్ మల్లన్న ఆమె పై ధ్వజం ఎత్తాడు.చివరకు బిసి వాదం ఘర్షణలు, కాల్పుల వరకు వెళ్ళింది.  ఈ ఎపిసోడ్ ఏమైనా బిసిలకు చిన్నమెత్తు లబ్దిచేసేది కాదు?ఇకపోతే,రెడ్డి,కమ్మ కులాల ఆధిపత్యం గత అర్థ శతాబ్దం కాలం గా కొనసాగుతుంది. ఎందరోరెడ్లు,కమ్మలు రాష్ట్రన్ని ఏలినా ఆయా కులాల్లో పేదలు,గర్భ దరిద్రం అనుభవిస్తున్న వారు లేరని చెప్పగలరా? ఏకులం కార్డు అయినా ఎన్నికల లబ్దికి, ఆ తర్వాత కులకోటా కోసం కొట్లాటకు తప్ప దేనికీ పనికిరావని ఇప్పటికే నిర్థారణ జరిగింది. సమాజంలో ఉన్న అణగారిన వర్గాల లో కొన్ని కులాలవారు ఎక్కువ సంఖ్యలో ఉన్న మాట వాస్తవమే! అయితే,వారికి ఆస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరపడానికి మన రాజకీయ వ్యవస్థ లో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకున్న వర్గాలే మరింత వెసులుబాటు కోరుతున్నారే కానీ, తమ వెనుక ఉన్న తమ  వారు తమ స్థాయికి ఎదగాలనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంది.

     మన రాష్ట్రంలో బహుజన ఉద్యమం గురించి ముందుకొచ్చిన ఐఏయస్ అధికారి ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఇప్పుడెక్కడ ఉన్నారు? వర్గపోరాటం , వర్ణ పోరాటం జతచేసి మాదిగలను సమున్నత స్థానం కు తీసుకెళతానన్న మందకృష్ణ మాదిగ నేడు వర్ణవ్యవస్థ ప్రతినిధిగా నేటికీ బహిరంగంగా నిలబడిన బిజెపి సమర్థకుడు గా ఎలా మారాడు?  బహుజన ఐక్యతా రాగం నిజాయితీ గా అందుకున్న విశారదన్ మహారాజ్ కు బహుజనుల మద్దతు ఎందుకు దొరకడం లేదు? ఇత్యాది ప్రశ్నలు తెలంగాణా రాజకీయ యవనికపై ఉండగానే  కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయ పోరాటం కులాల కుంపట్లు రాజేసింది.చేసిన వాగ్దానాలు అమలుచేసే స్థితి లేక సామాజిక న్యాయం పేరుతో తమ ఎజెండా ప్రాదాన్యత మార్చుకుంది. ఏదిఎలా ఉన్నా,ఎన్నో సంవత్సరాలుగా రగులుతున్న ఎస్సీ  రిజర్వేషన్ కు ఇప్పటికైనా ఒక పరిష్కారం చూప గలిగారు. ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో శూన్యం అవుతున్న ఈ దశలో వచ్చిన రిజర్వేషన్ వలన ఆయా వర్గాలకు పెద్దగా ఒనగూడే ప్రయోజనం ఏమీలేదు?  ప్రైవేటు రంగం ఆక్రమిస్తున్న దశలో రిజర్వేషన్లు పెంపు పెద్దకుట్రనే? ఇది కూడా ఇంకా బిసిలకు 42శాతం వాటా రిజర్వేషన్లు వ్యవహారం ఈ కోవకు చెందినదే! స్థానిక సంస్థలలో 42శాతం బిసి రిజర్వేషన్ ఆర్డినెన్సు రూపంలో తెస్తే ఎంత వరకు కోర్టులో నిలబడుతుంది తెలియదు. కానీ, తెలంగాణా క్యాబినెట్ ఓ తీర్మానం చేసి రాజకీయ బాణంగా వదిలేసింది. బిజెపి ఈ విషయంలో మౌనం దాల్చుతుంది ఎందుకు? పార్లమెంటులో చట్టం చేయాల్సిన బాధ్యత తనది కనుక! ఇంకా ఇతర ప్రతిపక్షాలు చిన్నాచితకా ఇదే నినాదం ఎత్తుకొని ఘర్షణలు పడుతున్నారు.

    ఇక ఇతర రాష్ట్రాల మాదిరిగా కొద్దికాలం లోనే కులాల వెనుక రాజకీయం కాకుండా నేరుగా కులాలు ముందు పెట్టిన రాజకీయాలను తెలంగాణా లోచూడబోతున్నాం. అంతిమంగా ఇవన్నీ వర్గం,కుల అంతరాలను పెంచేవేకాని, కులవివక్ష పరిష్కారం చేసేవి ఎంతమాత్రం కాదు!? ఇప్పుడు మనం మేధావి వర్గాలు సైతం ముదిరిన కుల ఉన్మాదం తో ఏదోఒక వాదాన్ని భుజం మీద వేసుకుని పెంచిపోషిస్తున్నారు. మనిషి మనిషిగా జీవించే వ్యవస్థ కోసం రాజకీయాలే అవసరం లేదు! ఆయా వర్గాల సామాజిక స్థితి నుంచి పెంచి చూపిన సంస్కర్తల మార్గం మానవ సమాజం ముందు పరిష్కారంగా ఉంది. కనుక వివక్షా పూరిత వర్ణ సమాజం మారాలంటే వర్గ సమాజం అంతరాలు,దొంతరలు పోవాలి. ఆ దిశగా మన ప్రయత్నం కొనసాగాలని కోరుకుందాం!

ఎన్.తిర్మల్.,(సీనియర్ జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త), 
సెల్: 9441864514, 
ఇమెయిల్: thirmal.1960@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *